
ఇండియాను ఇప్పుడు ఓ భయం పట్టుకున్నది. మొన్నటి వరకు చైనాకు మాత్రమే పరిమితమైన ఈ మహమ్మారి వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఒక్క అంటార్కిటికా తప్పించి మిగతా ఆరు ఖండాల్లో దీని ప్రభావం కనిపిస్తోంది. చైనాలో రోజు రోజుకు వ్యాధి బారిన పడుతున్న వ్యక్తులు తగ్గుతూ వస్తుండగా, దక్షిణ కొరియాలో ఈ సంఖ్య పెరుగుతున్నది. దీంతో అక్కడ ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. కొరియా కు చెందిన హ్యుందాయ్ కంపెనీ తన సంస్థను తాత్కాలికంగా మూసేసింది.
ఇది ఆ దేశ ఆర్ధిక వ్యవస్థకు విఘాతం కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఆసియాతో పాటుగా ఆరు ఖండాలలో ఈ వైరస్ వ్యాపించడం ఇప్పుడు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తోంది. గతంలో దీని వ్యాప్తి పెద్దగా ఉండదేమో అనుకున్నా, వరల్డ్ హెల్త్ సంస్థ మాత్రం దీని ప్రభావాన్ని ముందుగానే పసిగట్టి ప్రపంచదేశాలను హెచ్చరించింది. ఇప్పుడు అందరి చూపులు ఇండియా వైపు ఉన్నాయి.
ఇప్పటి వరకు ఇండియాలో కేవలం మూడు కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. చైనాకు అనుకోని ఉన్నప్పటికీ ఇండియాలోని వాతావరణం దృష్ట్యా వ్యాపించలేదు. ఒకవేళ ఇండియాలోకి ఈ వైరస్ ప్రవేశిస్తే కలిగే నష్టం అంచనా వేయడం చాలా కష్టం. ఇండియాలో జనసాంద్రత ఎక్కువ. జనసాంద్రత ఉన్న దేశం కాబట్టి ఎక్కడ ఎటువంటి అంచనాలు పెట్టుకోకూడదు.
ముఖ్యంగా ఇండియాలో వైరస్ వ్యాప్తి చెందితే, దానిని అరికట్టడం చాలా కష్టం అవుతుంది. అదుపు చేయడానికి ప్రభుత్వం ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నది. కానీ, ఇండియన్ ప్రభుత్వం మాత్రం, ఇండియాలో వైరస్ వ్యాపించలేదని, ఒకవేళ వ్యాపించినా దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు. ఏదైతేనేం మొత్తానికి ప్రపంచాన్ని ఈ వైరస్ చాలా ఇబ్బందులు పెడుతున్నది.