
తగువెలా వస్తుంది జంగం దేవరా? అంటే... అన్న సామెతకు అనుగుణంగా చిత్తూరు జిల్లా రాజకీయాలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఎలా వచ్చాయి? అధికార పార్టీ చెబుతున్నదానికి, అసలు వాస్తవానికి ఎంత తేడా ఉంది? పురపోరులో అనుసరించాల్సిన వ్యూహాలు.. తదితర విషయాలతోపాటు గోబెల్స్ ప్రచారం చేస్తున్న వైసీపీపై ఎదురుదాడి చేయడంపై నియోజకవర్గ నాయకులకు సూచనలిస్తున్నారు.
నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబునాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. తమను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కాక చంద్రబాబుపై ఎదురుదాడి చేస్తున్నారనేది తెలుగుదేశం పార్టీ నేతల వాదనగా ఉంది. తాము అధికారంలో ఉన్నప్పుడు వేధింపులకు గురిచేస్తే పుంగనూరు నేత ఉండేవాడా? అని చంద్రబాబు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. దీనిపై మండిపడ్డ మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేతపై విమర్శలను ఎక్కుపెట్టారు.
కుప్పంలో ఓడిపోయినప్పటికీ చంద్రబాబునాయుడికి కనువిప్పు కలగలేదని, బాబుకు దమ్ముంటే పుంగనూరులో పోటీచేయాలని సవాల్ విసిరారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని పంచాయతీల్లో ఓటమిపాలైన అనంతరం చంద్రబాబునాయుడిలో అసహనం పెరిగిందన్నారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చంద్రబాబు ఒక్కసారి కూడా ఇటువైపు చూడలేదని, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యే సరికి కుప్పం ప్రజలు గుర్తుకు వచ్చారని ఎద్దేవా చేశారు.
కరోనా కష్టకాలంలో కూడా కుప్పం ప్రజల పరిస్థితి తెలుసుకోలేదని చంద్రబాబుకు కుప్పంలో తిరిగి అర్హత లేదని మంత్రి అన్నారు. చంద్రబాబు గతంలో అక్రమంగా మిథున్ రెడ్డి ని 15 రోజుల పాటు జైల్లో పెట్టించారని, ప్రజలు జగన్ పాలన కు పట్టం కడుతూ తెలుగుదేశం పార్టీని ఛీ కొడుతున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. తన కుప్పం పర్యటనలో భాగంగా వైసీపీపై తీవ్రస్థాయిలో ఎదురుదాడిచేస్తున్న చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని చిత్తూరు జిల్లా వైసీపీ నాయకులు వాగ్బాణాలు సంధిస్తున్నారు. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల పరస్సర ఆరోపణల మధ్య చిత్తూరు జిల్లాతోపాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా వేడెక్కాయి.