ఒక్క సంఘ‌ట‌న‌.. ఒకే ఒక్క సంఘ‌ట‌న‌.. ఇప్పుడు ఏపీ అధికార పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఎవ‌రు ఔన న్నా కాద‌న్నా.. వైసీపీకి జీవిత‌కాల అభిమానులు కూడా స‌మ‌ర్ధించుకోలేక పోతున్న ఘ‌ట్టం.. ఇది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేసిన శుక్ర‌వారం అసెంబ్లీ ఎపిసోడ్‌లో ఆయ‌న కార్చిన క‌న్నీరు తాలూకు ఎఫెక్ట్‌.. వైసీపీపై ప‌డింద‌నేది వాస్త‌వం అని.. ఆ పార్టీ సీనియ‌ర్లే చెబుతున్నారు. ఈ చివ‌రి నుంచి ఆ చివ‌ర వ‌ర‌కు కూడా.. వైసీపీపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీంతో ఇప్పుడు ఏ ఇద్ద‌రు వైసీపీ నాయకులు ఫోన్లు చేసుకున్నా.. ఇదే విష‌యంపై ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు.

ఈ క్ర‌మంలో మ‌నం మారాల్సిందే.. అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ``దూకుడు మంచిదే. కానీ.. ఇలా కాదేమో. మ‌నం ఇరుక్కుని.. మ‌న పార్టీని ఇరికించి.. అంత‌కు మించి.. మ‌న నాయ‌కుడిని ఇరికించేలా చేస్తున్న విష‌యాలు బాధాక‌రం. మ‌న వాళ్లు ఇప్ప‌టికైనా మారాల్సిందే.`` అని గుంటూరుకుచెందిన ఒక సీనియ‌ర్ నాయ‌కుడు.. మాజీ ఎమ్మెల్సీ ఒకరు అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయ‌న చాలా సీనియ‌ర్‌. పైగా వైఎస్ కుటుంబానికి జ‌గ‌న్‌కు కూడా అత్యంత స‌న్నిహితులు. ఇక‌, తూర్పు, విశాఖ‌ప‌ట్నం జిల్లాల‌కు చెందిన సీనియ‌ర్లు, కురువృద్ధులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు.

``మీరు ఏమైనా చేయండి త‌ప్పుకాదు. కానీ, అంతిమంగా.. జ‌గ‌న్‌ను ఇరికించేలా మాత్రం చేయ‌కండి. ఎందుకంటే.. ఆయ‌న వ‌ల్లే మీరు అధికారంలోకి వ‌చ్చారు. ఆయ‌న ఇమేజ్ క‌నుక త‌గ్గిపోతే.. మీకు, పార్టీకి కూడా భవిష్య‌త్తు ఉండ‌దు`` అని విశాఖ‌కు చెందిన మాజీ మంత్రి, వైసీపీ సానుభూతి ప‌రుడు ఒకాయ‌న సూచించార‌ట‌. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా.. నాయ‌కులు.. స్పందించిన తీరు.. సొంత పార్టీ నేత‌లు మారాల‌నే. ఏదైనా ఉంటే.. సానుకూల ధోర‌ణితో మాట్లాడాల‌ని.. మ‌హిళ‌ల‌ను టార్గెట్ చేస్తున్నార‌నే భావ‌న‌ను తీసుకురావ‌డం మంచిది కాద‌ని.. కొంద‌రు సూచిస్తున్నారు.

అయితే.. దూకుడు ఉన్నా.. నియంత్రించుకునే స్థాయిలోనే ఉండాల‌ని నెటిజ‌న్లు సైతం సూచిస్తున్నారు. మ‌రి వైసీపీ నాయ‌కులు ఎలాంటి నిర్ణ‌యంతీసుకుంటారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: