ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల అమ్మ‌కాల కోసం సినిమాటోగ్ర‌ఫి చ‌ట్టానికి స‌వ‌ర‌ణ బిల్లును వైసీపీ ప్ర‌భుత్వం బుధ‌వారం అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టింది. ఈ సంద‌ర్భంగా సినిమాటోగ్ర‌ఫి మంత్రి పేర్నీ నాని మాట్లాడారు. రోజూ 4 ఆటలు ఉండాల్సింది... పది నుంచి 12 షోలు వేస్తున్నారు అని తెలిపారు. బలహీనతలు సొమ్ము చేసుకునే వ్యవస్థను కట్టడి చేసేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని వివ‌రించారు. ఆన్లైన్ లో టిక్కెట్లు అమ్మితేనే దోపిడీ అరికట్టగల మార్గం సుగ‌మం అవుతుంద‌ని చెప్పారు. ప్రభుత్వం నిర్దారించిన సమయంలోనే షోలు ప్రదర్శించాలి అని చెప్పారు.


  సినిమా పరిశ్రమ ప్రభుత్వ నిబంధనల కు లోబడే నడుచుకోవాల్సి ఉంటుంద‌ని.. ఇష్టానుసారంగా నడుచుకునే అవకాశం ఉండకూడదు అని తేల్చి చెప్పేశారు. ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు సినిమా చూసేలా మధ్యతరగతి వారి కోసం కొత్త విధానం తీసుకువ‌చ్చామ‌ని వివ‌రించారు. టాక్స్ లు కూడా పొంతన కుదరడం లేకుండా పోయింద‌ని, ఎవరూ టాక్స్ లు దాచేలా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించకుండా ఆన్ లైన్ విధానం తీసుకువ‌స్తున్నామ‌ని వివ‌రించారు. దీని ద్వారా తక్కువ రేటుకు వినోదం.. ప్రభుత్వానికి టాక్స్ ల రూపంలో ఆదాయం సరిగ్గా వస్తుంది అని చెప్పారు.



సినిమా డిస్ట్రిబ్యూటర్ ప్రభుత్వం పై నిందలు వేస్తే అర్థం ఉంటుంది... కానీ ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం పై బురద వేయడం దురదృష్టం అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రభుత్వం అప్పుల కోసం ఈ విధానం అని ఆరోపణలు చేయడం దురదృష్టకరం విమ‌ర్శించారు. బస్సు, రైలు టిక్కెట్లు ఆన్ లైన్ తీసుకోవడానికి లేని అభ్యంతరం సినిమా టిక్కెట్లపై ఎందుకు ? మంత్రి పేర్ని నాని ప్ర‌శ్నించారు. అత్యంత సౌలభ్యకరంగా సినిమా ను అందుబాటులోకి తెస్తాం అని చెప్పుకొచ్చారు. డబ్బులు పోగు చేసుకోవాలని... అప్పులు తేవాలని ఆలోచన ప్రభుత్వానికి లేదు అని స్ప‌ష్టం చేశారు. క్యూలైన్ లో నిలబడే అవసరం లేకుండా... టిక్కెట్లు తీసుకోవచ్చు అని వివ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: