ఉద్యోగుల పరస్పర బదిలీలకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేసింది. రెండేళ్లుగా కోవిడ్ కారణంగా బదిలీల ప్రక్రియ జరగలేదు. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన వినతుల మేరకు వచ్చే ఏడాది జనవరి 4వ తేదీ వరకు పరస్పర బదిలీలు నిర్వహించేందుకు వీలుగా నిషేధాన్ని సడలిచింది. రెండేళ్లపాటు ఒకేచోట పనిచేసిన ఉద్యోగులు.. ఏసీబీ, విజిలెన్స్ కేసులు లేని ఉద్యోగులే అర్హులని తెలిపింది.

ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా స్థానికత ఆధారంగా ఉధ్యోగుల విభజనకు సాధారణ పరిపాలనా శాఖ విధివిధానాలను ప్రకటించింది. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా విభజన చేయనుండగా.. జిల్లా స్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ, జోనల్-మల్టీ జోనల్ పోస్టులకు జీఏడీ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో తక్షణమే ప్రక్రియ అమల్లోకి రానుండగా.. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించి విభజన చేయనుంది.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను సొంత జిల్లాలకు బదలాయించే విధివిధానాలు ఖరారయ్యాయి. హైదరాబాద్ మినహా 32జిల్లాలో సీనియారిటీ ప్రకారం ఈ అవకాశం కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లాల్లో పనిచేస్తున్న వారు తమ సొంత జిల్లా లేదా అందులోని మరో జిల్లాను ఎంచుకునే అవకాశం ఉంది. దివ్యాంగులు, భార్యాభర్తలు, కారుణ్య నియామకాల్లోని వారికి ఐచ్ఛికాలు కల్పిస్తారు. దీనికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రకటనతో ఇరు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచే తాము కన్న కలలు నిజం అవుతుండటంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులు.. కేసీఆర్ సర్కార్ కు.. ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు జగన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. మరోవైపు తాము ఇన్నాళ్లు కలిసి పనిచేస్తున్న తోటి ఉద్యోగులను వీడలేక ఒకింత బాధకు గురవుతున్నారు.








మరింత సమాచారం తెలుసుకోండి: