తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు, ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. సాధారణంగా సీఎంలతో ప్రధాని అప్పుడప్పుడు అనేక అంశాలపై సమీక్ష కోసం భేటీ అవుతుంటారు. అది సాధారణమే.. కానీ ప్రతిపక్ష నేతతోనూ.. ఓ పత్రికాధిపతితోనూ మోడీ భేటీ కావడం అంటే విశేషమే. అయితే ఇందులో రాజకీయ ప్రాధాన్యత మాత్రం లేదు. మరి రాజకీయం లేకుండా వీరితో సమావేశం ఎందుకంటారా..?


మన దేశానికి స్వతంత్ర్యం వచ్చి 75 ఏళ్లవుతున్నాయి కదా.. ఆ సందర్భంగా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది కేంద్రం.. ఆ ఉత్సవాలు ఎలా జరపాలి.. ఇంకేం చేయాలి అనే అంశంపై ప్రధాని ఓ కమిటీ వేశారు.. ఆ కమిటీలో వీరంతా సభ్యులు. ఇప్పుడు ఆ కమిటీ సమావేశం వర్చువల్ ద్వారా జరిగింది.. ఆ సమావేశంలో కేసీఆర్, జగన్. చంద్రబాబు, రామోజీరావుతో పాటు మరో 20 మంది వరకు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జి.కిషన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. గాయకురాలు లతా మంగేష్కర్‌, నటుడు రజనీకాంత్‌ తదితరులు కూడా వర్చువల్ ద్వారా ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా అనేక ప్రతిపాదనలు వచ్చాయి.


కేసీఆర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి దేశవ్యాప్తంగా వెల్లివిరియాలన్నారు. తెలంగాణ సర్కారు స్వాతంత్య్ర పరుగు, కవి సమ్మేళనాలు, ఉత్సవాలను నిర్వహించిందని తెలిపారు.  మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జగన్ మాట్లాడుతూ.. ఆర్థికాభివృద్ధి పూర్తి స్థాయిలో పేదలకు అందడం లేదన్నారు. ఆర్థిక అసమానతలు గ్రామీణ ప్రాంతాల్లో అప్పుల భారం  పెంచుతున్నాయని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.


ఈనాడు అధినేత తమ పత్రిక ఇస్తున్న ప్రత్యేక కథనాల గురించి ప్రధానికి వివరించారు. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ప్రతి రోజూ ఓ ప్రత్యేక కథనం ఇస్తున్నామన్నారు రామోజీరావు. స్వతంత్రోద్యమంలో వెలుగులోని రాని ఎందరో ధీరులు గురించి స్పెషల్ స్టోరీలు ఇస్తున్నామని ప్రధానికి వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: