ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మొదలైంది. అధికార , ప్రతి పక్ష నేతలు అయితే ఇక ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ఇంకా అలాగే మరోవైపు నియోజక వర్గాల్లో అన్ని పార్టీలు కూడా బలమైన నేతలకు ప్రాధాన్యత నిస్తూ ఎన్నికలను ఎదుర్కొనేందుకు భారీ వ్యూహరచనలు చేయడం ప్రారంభించారు. అయితే జనబలం ఉన్న జనసేన పార్టీ పరిస్థితి మాత్రం ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలో బలం ఉందని చెప్పుకుంటున్న జనసేనకు.. కొన్ని నియోజకవర్గాల్లో కనీసం నాయకులు లేరు.. ముఖ్యంగా కార్యకర్తలు, అభిమానులు అధికంగా ఉన్న ఆ నియోజక వర్గంలో పార్టీని నడిపించే నాయకుడు కరువు.. జనసేన పార్టీ కి నాయకత్వం లేని నియోజకవర్గంగా నిలిచింది.కోనసీమ జిల్లాలో పి.గన్నవరం నియోజకవర్గంలో అసలు జనసేన పార్టీ ఉందా ఉంటే ఆ పార్టీని నడిపించే నాయకుడు ఎవరు ఇదే ప్రశ్న నియోజకవర్గ జనసేన పార్టీ క్యాడర్లో నెలకొంది.


2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి ఓటమి అనంతరం కంటికి కనిపించకుండా పోయారు. అంతేకాదు అసలు ఆమె పార్టీలో ఉన్నారో లేరో కూడా ఎవరికి తెలియదు.పి.గన్నవరం ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఇక్కడ నాయకులు ఎవరు జనసేన వైపు అసలు కన్నెత్తి చూడడం లేదు అంటే అతిశయోక్తి లేదు. గత మూడేళ్లుగా నాయకత్వం లేని నియోజకవర్గంగా పి.గన్నవరం జనసేన చరిత్ర కెక్కింది. నియోజకవర్గంలో ఎంతో కొంత క్యాడర్ ఉన్నప్పటికీ అందరిని సమన్వయం చేసి ముందుకి నడిపించే నాయకుడు లేడని పార్టీ కార్యకర్తలే బాహాటంగా చెబుతున్నారు. మరి రానున్న రోజుల్లో అయినా అధినాయకత్వం ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టి మంచి నాయకులను నియమిస్తారా లేదా ఎలక్షన్ల వరకు ఇలాగే వదిలేస్తారా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: