టీడీపీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తెలంగాణాలో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నారు. పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన అవగాహనా ఒప్పందాన్ని తెలంగాణా ప్రభుత్వంతో కుదుర్చుకున్నారు. అమర్రాజా బ్యాటరీస్ సంస్ధ  టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ దే అని అందరికీ తెలిసిందే. ఈ సంస్ధ తొందరలో తయారుచేయబోయే ఎలక్ట్రానిక్ వాహనాల బ్యాటరీల ఉత్పత్తి యూనిట్ ను తెలంగాణాలో పెట్టాలని డిసైడ్ అయ్యింది. కొత్త యూనిట్ పెట్టుబడి సుమారు రు. 9500 కోట్లు.





నిజానికి అమర్రాజా బ్యాటరీస్ ఉత్పత్తి యూనిట్లన్నీ ఏపీలోని చంద్రగిరి, కరకంబాడి, చిత్తూరులోనే ఉన్నాయి. కేవలం కార్పొరేట్ ఆఫీసు మాత్రమే మొదటినుండి హైదరాబాద్ లో ఉంది. అలాంటిది లిథియం అయాన్ గిగా బ్యాటరీల ఉత్పత్తి యూనిట్ ను మొదటిసారిగా తెలంగాణాలో పెట్టబోతున్నారు. మ్యానేజ్మెంట్ తాజా నిర్ణయానికి ఏపీలో పరిస్ధితులు అనువుగా లేకపోవటం కూడా కారణమయ్యుండచ్చు.





టీడీపీ తరపున గుంటూరు ఎంపీగా ఉన్న జయదేవ్ కు ప్రభుత్వంతో అనేక సమస్యలు ఉన్న విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డితో తెరవెనుక ఏవో గొడవలు జరిగాయి. దీంతోనే అమర్రాజా యాజమాన్యంతో భేటీకి కూడా జగన్ అంగీకరించటంలేదు. వివిధ సందర్భాల్లో జగన్ను కలవటానికి కంపెనీ యాజమాన్యం ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు. పైగా అమర్రాజా ఫ్యాక్టరీకి  పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మధ్య వివాదం నడుస్తోంది. యాజమాన్యం టీడీపీ ఎంపీ అవ్వటం వల్లే జగన్ కక్షసాధిస్తున్నట్లు ఎల్లోమీడియా బాగా ప్రచారం చేసింది.





అయితే సంస్ధలోని ఉద్యోగుల్లో ఎవరో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు లేఖ రాయటంతోనే తనిఖీలు చేయాల్సొచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. ఏదేమైనా ప్రభుత్వం-యాజమాన్యం మధ్య గొడవలు జరుగుతున్నది మాత్రం వాస్తవం. బహుశా ఇలాంటి వాతావరణం వల్లే జయదేవ్ పెట్టుబడులను ఏపీలో కాకుండా తెలంగాణాలో పెట్టాలని అనుకున్నట్లున్నారు. తమ ఉత్పత్తి యూనిట్ తెలంగాణాలో పెట్టడానికి పరిస్ధితులు అనుకూలంగా ఉన్నాయని జయదేవ్ చెప్పారు. ఏదేమైనా వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీ కోల్పోయిందన్నది మాత్రం వాస్తవం. ప్రభుత్వ విధానాల్లో రాజకీయాలు చొరబడకుండా ఉంటేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని పాలకులు గ్రహించాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: