మాజీ సీఎం చంద్రబాబుకు ఘోర అవమానం జరిగిందనే చెప్పాలి. ఆయన కొన్ని రోజులుగా అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. దీని కోసం ఏకంగా ఓ ఐక్యకార్యాచరణ సమితిని సృష్టించారు. పాపం.. అనేక నగరాలు తిరుగుతూ స్వయంగా జోలె పట్టి విరాళాలు సైతం సేకరిస్తున్నారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు అని నినాదాలు చేయిస్తున్నారు.

 

ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా సరే.. ఏపీలో ఎన్నికల వాతావరణం తీసుకొచ్చేశారు. అమరావతి పరిరక్షణ ర్యాలీలు..జేఏసీ నేతలతో కలసి భుజం భుజం కలిపి.. నడివీధుల్లో జోలె పట్టుకుని తిరగడం.. ఇలా పాపం.. రాజధానిగా అమరావతిని కొనసాగించేందుకు ఆయన ఎంతో కష్టపడుతున్నారు. అయితే ఇక్కడో ఓ షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఆయన సొంత నియోజక వర్గం కుప్పంలో ఏకంగా మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ భారీ ర్యాలీ జరిగింది.

 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు రాజధానులు వద్దంటూ పలు చోట్ల పర్యటిస్తుంటే... ఆయన సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో మూడు రాజధానులకు మద్దతుగా వైసిపి భారీ ర్యాలీ నిర్వహించింది. వైఎస్సార్‌సీపీ కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చంద్రమౌళి తనయుడు భరత్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ర్యాలీ అనంతరం.. వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు.

 

టీడీపీ నాయకులు అమరావతి చుట్టూ వేలాది ఎకరాలు కొనుగోలు చేశారని, వాటి విలువ తగ్గిపోతుందనే భయంతోనే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. సొంత నియోజక వర్గంలోనే జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రదర్శనలు జరుగుతుంటే.. అందులో జనం భారీగా హాజరవుతుంటే.. ఇక చంద్రబాబు అమరావతి పరిరక్షణ యాత్రలకు విలువ ఏముంటుంది.. జనం ఏమనుకుంటారు.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ మధ్య టీడీపీ నేతలు అమరావతి పరిరక్షణ ర్యాలీలు నిర్వహించడం.. వైసీపీ నేతలు మూడు రాజధానులకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహించడం సాధారణంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: