గత కొంత కాలంగా ఏపిలో టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మద్య మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం అందుకుంది. కేవలం 21 స్థానాలకు మాత్రమే టీడీపీ పరిమితం అయ్యింది.  ఐదేళ్ల పాలనలో టీడీపీ చేసిన అక్రమాల వల్ల ప్రజలు విసిగి పోయారని.. అందుకే వైసీపీ పట్టం కట్టారని అధికార పార్టీ నేతలు అంటున్న విషయం తెలిసిందే.  ఈ మద్య చంద్రబాబు, లోకేశ్ చేసిన తప్పులకు జీవితాంతం జైల్లో ఉంటారంటూ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.  తాజాగా  ఇల్లు అలకగానే పండగ కాదు.. అధికారం రాగానే రాష్ట్ర అభివృద్ధి అయిపోయినట్లు కాదు.. అని టిడిపి నేత, నటి దివ్యవాణి వైసిపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబును విమర్శించే స్థాయి రోజాకు లేదని అన్నారు.

 

రోజా భజన కార్యక్రమాలకు స్వస్తి పలకాలని..  అయినా పాలన అంటే మేకప్ వేసుకోవడం, జబర్దస్త్ స్కిట్లు చేయడం కాదని రోజాకు చురకలంటించారు.  గురువారం అమరావతిలో దివ్యవాణి మీడియాతో మాట్లాడుతూ...  మీ అవినీతి పరిపాలనకు దిక్కులేని స్థితిలో వివేకానంద రెడ్డి కూతురు సిబిఐ ను ఆశ్రయించడం సిగ్గుపడాల్సిన విషయం  అని అన్నారు.  ఐటీ రంగానికి ఇన్‌కంటాక్స్‌ రంగానికి వ్యత్యాసం తెలియని జగన్‌.. చంద్రబాబును విమర్శించడం చాలా బాధాకరమన్నారు. చంద్రబాబుకు సెక్యూరిటీ ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

 

సినీ పరిశ్రమ తలదించుకునేలా రోజా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సొంత నియోజకవర్గ ప్రజలే రోజాను అసహ్యించుకుంటున్నారని దివ్యవాణి విమర్శించారు. వైజాగ్‌లో స్థలాలను ఆక్రమించుకోవడానికి మీరెలా వెళుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంత వరకు ప్రత్యేక హోదా గురించి మీరెందుకు ప్రశ్నించడం లేదని దివ్యవాణి ప్రశ్నించారు.   అమరావతి ప్రజల మధ్యకు రాలేని దుస్థితిలో సీఎం జగన్, వైసీపీ నేతలు ఉన్నారని విమర్శించారు.  రోజా భజన కార్యక్రమాలు ఆపి ఇకనైనా ప్రజాసమస్యలను సీఎం దృష్టికి  తీసుకు వెళ్తే బాగుంటుందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: