ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ త్వరలోనే ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నారని చెప్పారు. జగన్ తో కొత్త జిల్లాల ఏర్పాటు గురించి తాను మాట్లాడానని అన్నారు. జగన్ తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత ఇక్కడ అభివృద్ధిని చూసి కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు వేశారని చెప్పారు. 
 
కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల రాష్ట్రంలో ప్రజలకు లబ్ధి జరిగిందని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దాదాపు అన్ని రాష్ట్రాలు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాయని చెప్పారు. కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లో మాత్రమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకోలేదని చెప్పారు. 
 
జిల్లాలు ఎక్కువ సంఖ్యలో ఉంటే అనేక సంస్థలు, కేంద్ర పాఠశాలలు, నవోదయ పాఠశాలలు వస్తాయని అన్నారు. తనకున్న సమాచారం ప్రకారం అతి త్వరలో ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయని చెప్పారు. ఏపీలో 13 జిల్లాల సంఖ్య 25కు చేరుకునే అవకాశం ఉందని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్రంలో అవసరానికి మించి జిల్లాల ఏర్పాటు జరిగిందని వ్యాఖ్యలు చేయడంతో కేసీఆర్ ఏపీలో కొత్త జిల్లాల అంశాన్ని ప్రస్తావించారు. 
 
ఏపీ సీఎం జగన్ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తానని ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ఫిబ్రవరిలో వార్తలు కూడా వచ్చాయి. కానీ కేంద్రం జనాభా లెక్కలకు సన్నద్ధం కావడంతో జగన్ నిర్ణయానికి బ్రేకులు పడ్డాయి. కేంద్రం వచ్చే ఏడాది మార్చి 31 వరకు జిల్లాల సరిహద్దులను మార్చవద్దని ప్రకటన చేయడంతో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేకులు పడ్డాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: