ఏపీలో కరోనా వైరస్ మీద జరుగుతున్న రాజకీయాల్లోకి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఫ్యామిలీ కూడా వచ్చి చేరింది. ఇటీవల నర్సీపట్నం రూరల్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సుధాకర్, ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ బారినపడిన, అనుమానిత లక్షణాలున్న వారికి సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందికి సరిపడా పరికరాలను అందించడం లేదని, వారి ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాట్లాడారు. అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని పొగుడుతూ, జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో అతన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

 

ఈ క్రమంలోనే సుధాకర్ వెనుక టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు హస్తం ఉందని నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేశ్ ఆరోపించారు. అలాగే సుధాకర్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసే ముందు అయ్యన్నని కలిశారని ఓ వీడియో చూపించారు. అయితే సుధాకర్ చేసిన విమర్శలకు తనకు సంబంధం లేదని, ఒకవేళ తన పాత్ర ఉందని నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధమని అయ్యన్న అన్నారు.

 

అలాగే తాను ఇంట్లో ఉంటున్నానో, బయట తిరుగుతున్నానో సి‌సి కెమెరాల్లో రికార్డు అయిన వీడియోలని తన తమ్ముడు సన్యాసి పాత్రుడు, ఎమ్మెల్యే గణేశ్‌కు అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. ఇక దీనిపై సన్యాసి పాత్రుడు కూడా స్పందిస్తూ.. డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో అయ్యన్న పాత్ర ఉందని… సుధాకర్‌ని, అయ్యన్న కలిసినట్లు సి‌సి కెమెరాల్లో ఉందని చెప్పారు.

 

ఇక ఇక్కడ అయ్యన్నకు సొంత తమ్ముడు నుంచే రాజకీయంగా దెబ్బపడినట్లు తెలుస్తోంది. టీడీపీ అధికారం కోల్పోయాక సన్యాసి పాత్రుడు వైసీపీలోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. అయితే అయ్యన్న, సన్యాసి పాత్రుడులు ఒకే ఇంట్లో ఉంటారు. ఇటీవల కూడా ఈ ఫ్యామిలీలో జెండాల గొడవ కూడా వచ్చింది. ఇంటిపైన టీడీపీ జెండా ఉండగానే, సన్యాసి పాత్రుడు వైసీపీ జెండా కట్టారు. అప్పుడే ఈ ఫ్యామిలీలో రచ్చ జరిగింది. ఇక ఇప్పుడు అయ్యన్నని, డాక్టర్ సుధాకర్ కలిసినట్లు సన్యాసి పాత్రుడు సి‌సి కెమెరాల్లో రికార్డు అయిన విషయాన్ని బయటపెట్టారు. మొత్తానికైతే ఒకే ఇంట్లో ఉండటం వల్ల తన తమ్ముడు ద్వారా అయ్యన్న పోలిటికల్ వ్యూహాలు తెలిసిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: