ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పెట్టిన బాకీలు ఇంకా ఏపీ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. 2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు.. తన పాలన చివరి సంవత్సరాల్లో పూర్తిగా ఎన్నికలపైనే దృష్టి పెట్టారు. వివిధ పథకాలతో ఎలా జనం ఓట్లు కొల్లగొట్టాలా అన్న ప్లానింగ్‌లోనే మునిగిపోయారు. అందుకే డ్వాక్రా మహిళలకు, వృద్ధులకు ఫించన్లు పెంచేశారు. ఆ ఓట్లు పదిలంగా పడతాయనుకున్నారు. ఈ నిధుల కోసం అనేక పథకాలకు బకాయిలు చెల్లించలేదు.

అవి ఎంతగా పెరిగిపోయాయంటే.. చంద్రబాబు దిగిపోయి.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో బాకీ చెల్లిస్తున్నారు. తాజాగా గిరిజన విద్యార్థులకు సంబంధించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నింటినీ చెల్లిస్తూ ఏపీ ప్రభుత్వం వివిధ జిల్లాలకు నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు నిధులను కూడా ఆయా జిల్లాలకు విడుదల చేయడం జరిగింది.

గిరిజన విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ పథకం కింద ప్రైవేటు పాఠశాలల్లో చదువుకున్నందుకు ప్రభుత్వం ఆయా పాఠశాలలకు ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. అయితే గత టీడీపీ ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన బిల్లులను 2017-18 సంవత్సరం నుంచి కూడా చెల్లించకుండా బకాయిలు పెట్టింది. ఈ కారణంగా బీఏఎస్ పథకాన్ని కొనసాగించలేని పరిస్థితి వచ్చింది. విషయం సీఎం దృష్టికి వెళ్లడంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ పథకానికి సంబంధించిన బకాయి మొత్తాలన్నింటినీ మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

గిరిజన సంక్షేమశాఖకు సంబంధించినంతవరకు 2017-2018 నుంచి 2019-2020 దాకా ఉన్న బకాయిల కోసం రూ.50.31 కోట్లను మంజూరు చేశారు. ఈ నిధులలో శ్రీకాకుళం జిల్లాకు రూ.4.13 కోట్లు, విజయనగరం జిల్లాకు రూ.3.14 కోట్లు, విశాఖపట్నం జిల్లాకు రూ.12.83 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాకు రూ.2.10 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాకు రూ.1.52 కోట్లు చొప్పున విడుదల చేశారు. అలాగే కృష్ణా జిల్లాకు రూ.0.98 కోట్లు, గుంటూరు జిల్లాకు రూ.4.40 కోట్లు, ప్రకాశం జిల్లాకు రూ.2.37 కోట్లు, నెల్లూరు జిల్లాకు రూ.5.43 కోట్లు, అనంతపురం జిల్లాకు రూ.7.91 కోట్లు, చిత్తూరు జిల్లాకు రూ. 2.08 కోట్లు, కడప జిల్లాకు రూ.1.47 కోట్లు, కర్నూలు జిల్లాకు రూ. 1.90 కోట్లు చొప్పున విడుదల చేశారు. బీఏఏస్ పథకాన్ని ప్రస్తుతం 9, 10 తరగతుల విద్యార్థులకు కొనసాగిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: