రోజురోజుకూ విశ్వసనీయత కోల్పోతున్న నిమ్మగడ్డ.. అప్పుడు అలా.. ఇప్పుడేమో ఇలా..
అమరావతి: కరోనా విపరీతంగా ఉందని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలని చూస్తుండటం విడ్డూరంగా ఉంది. అయితే ఇప్పుడే ఎన్నికలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ ఎందుకు ఉవ్విలూరుతున్నారంటే.. ఒకటి తన పదవీకాలం ముగిసే లోపే ఎన్నికలు నిర్వహించాలన్నది ఆయన ఆలోచనగా ఉంది. ఇక రెండోదా టీడీపీ కూడా ఇదే కోరుకుంటోంది. నిమ్మగడ్డ ఉన్నప్పుడే ఎన్నికలు నిర్వహిస్తే కర్రపెత్తనం చేయవచ్చని ఆలోచిస్తోంది. నిమ్మగడ్డ కూడా టీడీపీ విధానాలుగా అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. నిమ్మగడ్డ హయాంలో ఎన్నికలు జరిగితే ఇప్పటికే ఏకగ్రీవం అయిన వాటిని కూడా రద్దు చేయించాలన్న ధోరణిలో టీడీపీ ఉంది. టీడీపీ అనుకున్నదే నిమ్మగడ్డ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తోంది. అయితే నిమ్మగడ్డ పదవీకాలం ఏప్రిల్ నెలతో గడవనుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఏకగ్రీవం అయిన వాటిని రద్దు చేసే అధికారం నిమ్మగడ్డకు లేదని అధికార పార్టీ చెబుతోంది.    

ఎన్నికలు వాయిదా ముందే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో పాటు 660 జడ్పీటీసీల్లో 126 స్థానాల్లో 10,047 ఎంపీటీసీ స్థానాలో 2360 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇలా ఏకగ్రీవం అయిన వారందరికి జిల్లా రిటర్నింగ్ అధికారులు గెలిచినట్టు ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేశారు. ఇలా ఒకసారి గెలిచినట్టు ధ్రువీకరణ పత్రం ఇచ్చాక వాటిని రద్దు చేసే అధికారం ఈసీ చేతిలో లేదని అధికార పార్టీ చెబుతోంది. గెలిచిన వారిని తొలగించాలంటే ఎన్నికల ట్రిబ్యూనల్ ద్వారానో లేదా అనర్హత వేటు ద్వారానో మాత్రమే సాధ్యమవుతుందని చెబుతున్నారు. అంతే కాని నిమ్మగడ్డ ఇష్టానికి తొలగించే అధికారం లేదు అని అధికార పార్టీ చెబుతోంది. మరీ బలమైన కారణాలుంటే ఒకటి, రెండు చోట్ల ఎన్నికలు రద్దు చేయచ్చు కానీ.. మొత్తానికి ఏకగ్రీవాలను రద్దు చేసే అధికారం ఎన్నికల కమిషనర్ కు లేదని వాదిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన చోట కూడా తిరిగి నిర్వహించాలంటే పోటీలో ఉన్న ప్రతి ఒక్కరి నుంచి ఈ సీ అభిప్రాయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ వారి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా ఈసీ నిర్ణయం తీసుకుంటే వారంతా కోర్టును ఆశ్రయించే అవకాశం లేకపోలేదు.

టీడీపీ చెప్పినట్టు నడుచుకుంటూ నిమ్మగడ్డ ఏకగ్రీవాలను రద్దు చేస్తే ఈ వ్యవహారం మొత్తం కోర్టుకు వెళ్లక తప్పదు. మళ్లీ ఈ వ్యవహారం నిమ్మగడ్డ పదవీకాలం తీరేలోపు తీరుతుందో లేదో కూడా తెలీదు. ఏకగ్రీవం అయిన వారిని రద్దు చేస్తే వాటిని కోర్టు కూడా సమర్థించదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మీద నిమ్మగడ్డ ఏం చేసినా అటు తిరిగి ఇటు తిరిగి ఆయనకే అడ్డంకిగా మారక తప్పదు. ఏదేమైనప్పటికి పదుల సంఖ్యలో కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేయడం.. ఇప్పుడు వేల సంఖ్యలో కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహిస్తానని చెప్పడంతో నిమ్మగడ్డ విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు హైదరాబాద్ లోని ఓ హోటలలో టీడీపీని నడిపించే కీలక వ్యక్తులను ఆయన కలవడంపై కూడా అనుమానాలు రేకెత్తాయి. మొత్తం మీద ఆయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ కు అయితే రోజురోజుకూ బలం చేకూరుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: