తెలంగాణలో మీడియా కేసీఆర్ కు ఊడిగం చేస్తోందా.. కేసీఆర్ కు భయపడి వార్తలు రాస్తోందా.. అవునంటున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. కొన్ని టీవీ ఛానళ్లు ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నాయని.. కనీసం ఏం జరిగిందో తెలుసుకోకుండా స్క్రోలింగ్స్ ఇస్తున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇంట్లో డబ్బు దొరికిన విషయాన్ని పదే పదే ప్రసారం చేస్తున్న, వార్తలు ఇస్తున్న పత్రికలకు, టీవీలకు టీఆర్ఎస్ పంచే డబ్బులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

అంతే కాదు.. పత్రికలు, టీవీ ఛానళ్ల వ్యవహారంపై ఉద్యమిస్తామంటోది తెలంగాణ బీజేపీ. ఛానళ్లకు, పత్రికలకు వ్యతిరేకంగా కేంద్రానికి ఫిర్యాదు చేస్తామంటోంది. పత్రికల సర్క్యులేషన్ ఎలా దెబ్బతియాలో తమకు తెలుసంటున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. నెంబరు వన్ అని చెప్పుకునే పత్రికలు మా సహనాన్ని పిరికితనంగా చూస్తున్నాయని ఆరోపించారు. మా బీజేపీ కార్యకర్తలు మీ ఛానళ్ల మీదకు వస్తే ఒక్క స్టూడియో కూడా మిగలదని హెచ్చరించారు.


ముఖ్యమంత్రి ఇచ్చే ప్యాకేజీలకు కక్కుర్తి పడి ఛానళ్లు, పత్రికలు ఇష్టాసారంగా వ్యవహరిస్తున్నాయన్న బండి సంజయ్.. ఇదా తెలంగాణలో మీడియా వ్యవహరించే తీరు అంటూ ప్రశ్నించారు. మీ అక్రమ ఆస్తులపై కేంద్రంతో విచారణ జరిపిస్తామన్న సంజయ్.. అంత వరకు కొనితెచ్చుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. అయితే తన ఆరోపణలు ముఖ్యమంతి మోచేతి నీళ్లు తాగే పేపర్లు, ఛానళ్లకు మాత్రమే
 వర్తిస్తాయని.. పత్రిక స్వేచ్ఛకు తాము గౌరవిస్తామని... కానీ దాన్ని అలుసుగా తీసుకోవద్దని చెప్పారు.

ముఖ్యమంత్రి రిపోర్టర్లను గద్దిస్తే యాజమాన్యాలు చేతగాని తనంతో చూస్తున్నాయని.. రాష్ట్ర అధ్యక్షునిగా తాను ప్రెస్ మీట్ పెడితే చిన్న ఐటెం ఇస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందని... తాను ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నా ఎందుకు కవరేజీ ఇవ్వరని ప్రశ్నించారు. యాడ్ ఇస్తేనే ఐటెం రాస్తారా ? అని ప్రశ్నిస్తున్న బండి సంజయ్.. తన దగ్గర యాడ్ ఇచ్చే డబ్బులు లేవని.. యాడ్స్ ఇస్తేనే పేపర్లు, టీవీలు నడుపుతామంటే బంజేసుకోర్రి అంటూ హెచ్చరించారు బండి సంజయ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: