పవన్ కల్యాణ్ హడావిడిగా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం ఖరారైనట్టు చెబుతున్నా.. మరికొందరు జాతీయ నేతలు కూడా పవన్ కి అపాయింట్ మెంట్ లు ఇచ్చారని తెలుస్తోంది. అసలింతకీ పవన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు, బీజేపీ అగ్రనేతలు జనసేనానిని ఎందుకు హస్తిన పిలిపించుకున్నారు.

పవన్ కల్యాణ్ గ్రేటర్ బరిలో దిగుతానని చెప్పినా, ఆ తర్వాత వెంటనే మాట మార్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా.. ఇతర నేతల జోక్యంతో పవన్ కల్యాణ్ గ్రేటర్ బరిలోనుంచి తప్పుకున్నారు. జనసేన ఓట్లన్నీ బీజేపీకే వేయాలని కార్యకర్తలు, నాయకులకు సందేశమిచ్చినా.. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయడానికి మాత్రం పవన్ వెనకాడుతున్నారు. అటు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా పవన్ ని ప్రచారం కోసం ఆహ్వానించలేదు, కనీసం చర్చలు కూడా జరపలేదు. ఈ నేపథ్యంలో పవన్ కి ప్రచార బాధ్యతలు అప్పజెప్పేందుకే నేరుగా ఢిల్లీ పిలిపించారని తెలుస్తోంది. ఈ వార్తల్లో వాస్తవం ఉన్నా  లేకపోయినా.. తిరుపతి లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల విషయం మాత్రం ఇరు పార్టీల మధ్య కచ్చితంగా చర్చకు వస్తుందని సమాచారం.

దుబ్బాక విజయంతో తిరుపతి లోక్ సభ స్థానాన్ని కూడా కైవసం చేసుకోడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అటు వైసీపీ దివంగత నేత బల్లి దుర్గా ప్రసాద్ తనయుడికి టికెట్ ఇవ్వదని తేలడంతో.. ఈ ఎన్నికల్లో సింపతీ ఓటింగ్ జరగదని అర్థమవుతోంది. అలాంటప్పుడు బలమైన నేతను నిలబెడితే, చెమటోడ్చి ప్రచారం చేస్తే, మరింత పగడ్బందీగా ఎన్నికల వ్యూహాలు రచిస్తే గెలుపు కష్టమేమీ కాదనేది బీజేపీ ఆలోచన. అందుకే ఆ పార్టీ జనసేనానిని ఢిల్లీకి పిలిపించి మరీ వ్యూహాలు రచిస్తోంది. తిరుపతి బై పోల్ అంశంపై పవన్ కల్యాణ్ తో బీజేపీ పెద్దలు సమాలోచనలు జరుపుతారని తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికల ప్రచార బాధ్యతను పవన్ పై పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అభ్యర్థి ఎంపికలో కూడా పవన్ కి ప్రాధాన్యత ఇస్తారని అర్థమవుతోంది. అందుకే పవన్ కల్యాణ్ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం అవుతున్నారని పొలిటికల్ వర్గాల సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: