ముంబై: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్‌పీ కుంభకోణం గుర్తుందా? ఇప్పుడు ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. ముంబై పోలీసులు ఈ కేసును విచారిస్తుండగానే... రిపబ్లిక్ టీవీ చీఫ్ ఆర్నాబ్ గోస్వామి, బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తా సహా పలువురి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు బయట పడ్డాయి. ఈ లీక్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దాదాపు 500 పేజీలకు పైగా ఉన్న ఈ చాట్ మెసేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఇవి ‘‘తిరుగులేని ఆధారాలు’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొన్ని మెసేజిలలో టీఆర్పీకి సంబంధించి అవసరమైతే ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి సాయం చేస్తానంటూ అర్నాబ్ గోస్వామి భరోసా ఇవ్వడం కనిపిస్తోంది. మరో చాట్‌లో  ‘‘మంత్రులంతా మనతోనే ఉన్నారు’’ అని ఆయన సమాధారం ఇవ్వడంపై గుసగుసలు మొదలయ్యాయి. కండీవలి పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైనట్టు కనిపిస్తున్న ఈ పీడీఎఫ్ పేజీల్లో... ప్రతి పేజీపైనా ఎవరో ఒకరి సంతకం ఉండడం గమనించాల్సిన విషయం.

2019 జూలైలో ప్రారంభమై అదే ఏడాది అక్టోబర్ వరకు ఈ సంభాషణలు జరిగినట్లు తెలుస్తోంది. ఇది ఒకటే చాట్ కాదు. ఓ వాల్యూమ్‌ పేజీల్లో హెడింగ్‌లు పెట్టి అర్నాబ్ గోస్వామి, వికాస్ ఐడెమ్, ఆర్‌ఆర్‌పీ గ్రూప్, రోమిల్ రంగారియా తదితరుల మధ్య జరిగిన సంభాషణలు కూడా విడుదల అయ్యాయి. కాగా, మిగిలిన చానెళ్లతో పోలీస్తే కొన్ని అంశాలను రిపబ్లిక్ చానెల్ ఏ విధంగా వక్రీకరిస్తూ వచ్చిందనే దానిపై మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలు మాట్లాడుకున్న సంభాషణ మొదలు.. కేంద్ర మంత్రులపై బార్క్ మాజీ సీఈవో దాస్‌గుప్తా చేసిన వ్యాఖ్యల వరకు అన్నీ ఈ లీకైన చాట్‌లో కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి ఒకరిని ‘‘యూజ్‌లెస్’’ అంటూ దాస్‌ గుప్తా తిట్టడం కూడా కనిపిస్తోంది. మరో సందేశంలో చానెల్ మనుగడకు సంబంధించి గోస్వామి ఉద్దేశ్య పూర్వకంగా స్పందిస్తూ.. ‘‘మంత్రులంతా మనతోనే ఉన్నారు..’’ అనడం సంచలనం రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: