ఒక వైపు సినిమాలు వేగంగా చేస్తూ వస్తున్న పవన్ అంతే వేగాన్ని రాజకీయాల్లో కూడా చూపిస్తున్నారు. ఇప్పటికే క్రిష్ణా, తూర్పు గోదావరి జిల్లాల టూర్లు చేసిన పవన్ ఇపుడు రాయలసీమ టూర్ కి రెడీ అయ్యారు. అది కూడా పవిత్ర పుణ్య క్షేత్రం తిరుపతి లో పవన్ తాజా పర్యటన ఉండడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.

తొందరలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రానుంది. మార్చి 15 లోగా ఈ ఉప‌ ఎన్నిక పూర్తి కావాలి. మరి ఈ ఉప ఎన్నిక విషయంలో అధికార వైసీపీ ఇప్పటికే తన అభ్యర్ధిని రెడీ చేసి పెట్టుకుంది, కానీ ప్రకటించలేదు, అదే సమయంలో చాన్నాళ్ల ముందుగానే టీడీపీ కూడా తన అభ్యర్ధిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని ప్రకటించింది.

ఇక సంక్రాంతి తరువాత ప్రచారానికి కూడా టీడీపీ రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో బీజేపీ జనసేన నుంచి ఎవరు ఉమ్మడి అభ్యర్ధిగా ఉంటారు అన్నది మాత్రం ఎటూ తేలడంలేదు. పవన్ ఆ మధ్య ఢిల్లీ వెళ్ళి బీజేపీ కేంద్ర పెద్దలను కలసి వచ్చారు. ఉమ్మడి అభ్యర్ధి కోసం కమిటీని వేస్తారని, అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్ధి పేరు ప్రకటిస్తారని అన్నారు. కానీ అది జరగలేదు.

ఇదిలా ఉంటే బీజేపీ ఈ మధ్య జోరు పెంచేసింది. తన ప్రతీ కార్యక్రమం తిరుపతి వేదికగానే నిర్వహిస్తోంది.ఆ విధంగా తిరుపతి బరిలో తామే ఉంటున్నట్లుగా సందేశం ఇస్తోంది. ఈ తీరుతో జనసైనికులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో పవన్ హఠాత్తుగా  తిరుపతి పర్యటనను పెట్టుకున్నారు. ఈ నెల 21న పవన్ తిరుపతికి వస్తారని అంటున్నారు. అక్కడే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ మీటింగు కూడా ఉంటుందని చెబుతున్నారు. మరి పవన్ తిరుపతి టూర్ ఆ జోరు చూస్తూంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీటుని వదులుకోవడానికి సిధ్ధంగా లేరు అన్న మాట వినిపిస్తోంది. చూడాలి మరి పవన్ వేస్తున్న ఈ పొలిటికల్ స్టెప్ ఏపీ రాజకీయాల్లో ఏ రకమైన సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: