ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం సింగరపల్లిలో జనసేన పార్టీ కార్యకర్త బండ్ల వెంగయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం అయింది. నాలుగు రోజుల క్రితం గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు గ్రామ పర్యటన సమయంలో పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి  వెంగయ్య, మరికొందరు కార్యకర్తలు తీసుకు వెళ్ళారు. జనసేన కార్యకర్తలపై ఆగ్రహంతో నానా దుర్బాషలు ఆడారు ఎమ్మెల్యే అన్నా రాంబాబు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే తిట్ల పురాణం వీడియోలు వైరల్ అయ్యాయి.

జనసేన కార్యకర్త వెంగయ్యను బెదిరింపులకు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అనుచరులు గురి చేసారు. ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపుల వల్లే వెంగయ్య ఆత్మహత్య చేసుకుని ఉంటాడని జనసేన కార్యకర్తల ఆరోపణలు చేసారు. మానసిక స్థితి సరిగా లేక ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు అంటున్నారు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. గ్రామంలో పారిశుధ్య సమస్య తీర్చమని అడిగినా ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందేనా? అని ఆయన నిలదీసారు. గిద్దలూరు ఎమ్మెల్యేను ప్రశ్నించిన జనసేన కార్యకర్త   బండ్ల వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకోవడం  బాధాకరం  అని అన్నారు.

ఆత్మహత్యకు అధికార పక్షం బాధ్యత వహించాలి  అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు. వైసీపీ నిరంకుశ పాలనకు నిదర్శనం ఇది  అని ఆయన ఆరోపించారు. గ్రామంలో సమస్య పై ఎమ్మెల్యేను ప్రశ్నించడం తప్పా అని ప్రశ్నించారు. కనీసం సమాధానం ఇవ్వలేని స్థితిలో ఎమ్మెల్యే  రాంబాబు ఉన్నారా అని ఆయన నిలదీశారు.  'నీ మెడలో పార్టీ కండువా తీయ్...' అని మొదలుపెట్టి సభ్యసమాజం పలకలేని భాషలో మాట్లాడతారా అని ప్రశ్నించారు. ప్రశ్నించిన ఆ యువకుణ్ణి  ప్రజల మధ్యనే ఎమ్మెల్యే బెదిరించారు అని అన్నారు.  వివిధ రూపాల్లో ఒత్తిళ్లకు గురి చేసినట్లు మాకు సమాచారం అందింది అని పవన్ పేర్కొన్నారు. వెంగయ్య నాయుడు కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు.  ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: