ఏపీ రాజకీయాల్లో సంచయిత ఓ సంచలనం అనే చెప్పాలి. టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్న ఆనంద గజపతి రాజు కుమార్తెగా ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టిన సంచయిత కొంతకాలం బీజేపీతో నడిచిన విషయం తెలిసిందే. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక అశోక్ గజపతిరాజుకు చెక్ పెడుతూ, పూసపాటి వంశం ఆధ్వర్యంలో నడుస్తున్న మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ఆలయంతో పాటు, పలు ఆలయాల ఛైర్మన్‌గా సంచయితని నియమించారు.

ఇక ఇక్కడ నుంచి సంచయిత ఏపీ రాజకీయాల్లో హైలైట్ అయింది. అసలు సంచయిత పూసపాటి వంశానికి చెందిన వ్యక్తి కాదని, ఆనంద గజపతిరాజు మొదటి భార్య ఎప్పుడో విడాకులు తీసుకుని వెళ్లిపోయిందని, ఇప్పుడు ఆమె కుమార్తెకు ఇలా పదవులు ఇవ్వడం కరెక్ట్ కాదని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. దీనిపై అశోక్ గజపతి న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు.

ఈ గొడవ ఇలా సాగుతుండగానే, మధ్య మధ్యలో అశోక్, సంచయితల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. సంచయిత, అశోక్-చంద్రబాబు టార్గెట్‌గా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అటు టీడీపీ నేతలు-అశోక్ కూడా సంచయితపై విమర్శలు చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సంచయిత, అశోక్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేసింది. ఎన్టీఆర్‌ని గద్దె దించడంలో అశోక్ పాత్ర కూడా ఉందని, దీనిపై ఎన్టీఆర్ స్వయంగా స్పీకర్‌కు రాసిన లేఖని కూడా బయటపెట్టి ఫైర్ అయింది.

అయితే ఓ ట్రస్ట్, పలు ఆలయాల ఛైర్మన్‌గా ఉన్న సంచయిత రాజకీయం కూడా చేస్తున్నట్లు కనిపిస్తోంది. పక్కా వైసీపీ నాయకురాలు మాదిరిగానే సంచయిత మాట్లాడుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సంచయిత సిద్ధమయ్యే ఇలా రాజకీయాలు చేస్తున్నారని చెబుతున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో సంచయిత విజయనగరంలో అశోక్ గజపతి ఫ్యామిలీపైనే పోటీ చేసే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. మరి చూడాలి సంచయిత పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయో.

మరింత సమాచారం తెలుసుకోండి: