కర్నూలు జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న కుటుంబం ఏదైనా ఉందటే అది, కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీనే. దశాబ్దాల పాటు టీడీపీలో రాజకీయం చేస్తున్న కేఈ ఫ్యామిలీ 2019 ఎన్నికల తర్వాత ఇబ్బందులు పడుతుంది. ఆ ఎన్నికల్లో పత్తికొండ నుంచి కేఈ కుమారుడు శ్యామ్ టీడీపీ నుంచి ఓడిపోగా, డోన్ నుంచి కేఈ సోదరుడు ప్రతాప్ ఓటమి పాలయ్యారు.

ఇక కేఈ ఇప్పుడు రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. అలాగే ఆయన తనయుడు శ్యామ్, సోదరుడు ప్రతాప్ అడ్రెస్ లేరు. కానీ కేఈ మరో సోదరుడు ప్రభాకర్ మొన్న ఆ మధ్య టీడీపీకి రాజీనామా చేశారు. అయితే సడన్‌గా ప్రభాకర్ మళ్ళీ తెరపైకి వచ్చారు. తాను టీడీపీకి రాజీనామా చేశానని, కానీ ఆ రాజీనామాని టీడీపీ అధిష్టానం ఆమోదించదలేదని ట్విస్ట్ ఇచ్చారు.

అలాగే చంద్రబాబు, ప్రభాకర్‌నే డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా నియమించారు. డోన్ నియోజకవర్గంలో వైసీపీ స్ట్రాంగ్‌గా ఉంది. గత రెండు పర్యాయాలు నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్‌లో గెలుస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక మంత్రిగా ఉన్న బుగ్గనకు చెక్ పెట్టడం కేఈ ప్రభాకర్‌కు సాధ్యమయ్యే పనికాదు. అయితే గతంలో ప్రభాకర్ డోన్ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. 1996 ఉపఎన్నికలో టీడీపీ తరుపున డోన్ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభాకర్, 1999 ఎన్నికల్లో కూడా విజయం సాధించారు.

అలాగే 2009లో డోన్ నుంచి కేఈ కృష్ణమూర్తి విజయం సాధించారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి బుగ్గన గెలుస్తూ వస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా బుగ్గన విజయానికి ఎలాంటి ఢోకా లేదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో బుగ్గన మీద ఓడిన కేఈ కృష్ణమూర్తి మరో సోదరుడు ప్రతాప్ రాజకీయాలకు దూరమయ్యారు. దీంతో డోన్ బాధ్యతలు ప్రభాకర్‌కు ఇచ్చారు. మరి ప్రభాకర్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఏ మేర పోటీ ఇస్తారో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: