ఏపీలో ఎన్నో సామాజిక వర్గాలు ఉన్నాయి. అందరినీ సమాదరించేందుకే ప్రజాస్వామ్యం ఉంది. రాజ్యాంగమూ ఉంది. కానీ కొన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు ఇప్పటికీ నానా అవస్థలూ పడుతున్నారు. ప్రభుత్వానికి వారి మీద చిన్న చూపూ చూస్తూ  సీత కన్నూ వేయ‌డంతో వారు కూరలో  కరివేపాకు మాదిరిగా పెద్దల  రాజకీయ అవసరం తీరాక ఎటూ కాకుండా పోతున్నారు.

ఏపీలో బ్రాహ్మణ సామాజిక వర్గం ఉంది. వీరి సంఖ్య పరిమితం అయినా వీరికి గతంలో బాగానే రాజకీయ ప్రాధ్యాన్యత ఉండేది. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం ఈ సామాజికవర్గానికి చెందిన వారే. ఆ తరువాత కూడా వీరు రాజకీయంగా మంత్రులుగా కేంద్ర మంత్రులుగా రాణించారు. అయితే ఇపుడు మాత్రం సీన్ మారింది.

రాజకీయ పదవుల సంగతి దేముడెరుగు కనీసం తమ కులం పేదరికంలో ఉంటే ఆదుకునే ప్రభుత్వం లేదని మండిపడుతున్నారు. చంద్రబాబు 2014 లో బ్రాహ్మణ కార్పోరేషన్ ఒకటి ఏపీలో  ఏర్పాటు చేశారు. దానికి 500 కోట్ల నిధులు ఇస్తామని కూడా చెప్పారు. అయిదేళ్ల చంద్రబాబు ఏలుబడిలో అచ్చంగా ఇచ్చిన  నిధులు రెండు వందల పాతిక కోట్లు మాత్రమే.

ఇక అప్పట్లో విపక్షంలో ఉన్న జగన్ అయితే విశాఖలో జరిగిన బ్రాహ్మణ ప్రతినిధుల సమావేశంలో పాలుపంచుకున్నారు. ఆయన నాడు బ్రాహ్మణులకు న్యాయం చేస్తానంటూ పెద్ద హామీలే ఇచ్చారు. అంతే కాదు బ్రాహ్మణ  కార్పోరేషన్ కి వేయి కోట్ల నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తామని కూడా చెప్పుకొచ్చారు.

చిత్రమేంటంటే జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దగ్గర పడుతోంది కానీ బ్రాహ్మణ కార్పోరేషన్ కి అతీ గతీ లేకుండా ఉంది. పధకాలు  కూడా గతంలో ఉన్నవి ఏ ఒకటీ కొనసాగించడంలేదు. అప్పట్లో పేద బ్రాహ్మణుల పిల్లలకు ఉపకార వేతనాలు ఇచ్చేవారు. కేవలం బ్రాహ్మణుల కోసం వివిధ స్కీములను కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కానీ ఇపుడు అవన్నీ మూలన పడ్డాయి. ఆఖరుకు బ్రాహ్మణ కార్పోరేషన్ ద్వారా వచ్చే పించన్లను కూడా సామాజిక పించన్లకు మళ్ళించేశారు. దాని వల్ల కూడా చాలా మంది అనర్హులైపోయారు. మొత్తానికి చూస్తే చంద్రబాబే నయం అనిపించేలా జగన్ తీరు ఉందని బ్రాహ్మణులు గుస్సా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: