తెలంగాణ రెండో ముఖ్యమంత్రి ఎవరు? కేటీఆర్ పట్టాభిషేకానికి ముహుర్తం ఖరారైందా? ఇదే ఇప్పుడు తెలంగాణలో అతిపెద్ద చర్చగా మారింది. అయితే  తెలంగాణ ప్రభుత్వంలో మార్పులు, ముఖ్యమంత్రి  అంశాలపై కాంగ్రెస్ సీనియర్ నేత,  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలన చేతకాకే కేసీఆర్ దిగిపోవాలని అనుకుంటున్నారని కామెంట్ చేశారు. కేసీఆర్ చేతకాకుండా అయిపోయాడని... అందుకే కేటీఆర్‌ను సీఎం అంటున్నారని చెప్పారు. కేసీఆర్‌కు వయస్సు మల్లిందని.. ఆ కారణంతోనే కేటీఆర్‌ను తెర మీదకు తీసుకువస్తున్నారని తెలిపారు. పాలన చేతకాని ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు జీవన్ రెడ్డి.
 
             కేసీఆర్‌కు కేంద్ర వ్యవసాయ చట్టాలను అమలు చేయడంపై చూపించే శ్రద్ధ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ అమలుపైన కూడా రెండేళ్ల సమయం పట్టిందని మండిపడ్డారు. ఆరోగ్య శ్రీ అంత కంటే మెరుగు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆయుష్మన్ భారత్ ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు. అగ్రవర్ణ పేదల కోసం ఈడబ్ల్యూఎస్ అమలు చేయడం కూడా రెండేళ్లు ఆలస్యం చేశారని విమర్శించారు. ఎన్నికల్లో వరుస పరాజయాలతో ఇప్పుడు అమలు చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రికి ఇప్పటికైనా కనువిప్పు కలిగినందుకు సంతోషమన్నారు జీవన్ రెడ్డి.
   
            తెలంగాణ పాలనలో మార్పులు జరుగుతాయన్న ప్రచారంపై సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా స్పందించారు. సీఎం మార్పు కేంద్ర హోం మంత్రి అమిత్ షా డైరెక్షన్ లోనే జరగబోతోందనే అనుమానాలు కూడా ఉన్నాయన్నారు జగ్గారెడ్డి.  కేటీఆర్ సీఎం కావడం వల్ల బీజేపీకే ఉపయోగమని... తెలంగాణలో బీజేపీ కొత్త ఆటను ప్రారంభిస్తుందని చెప్పారు.   తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలల్లో భాగ్యలక్ష్మి అమ్మవారిని  తెరపైకి తెచ్చారని... సాధారణ ఎన్నికల సమయానికి ఏ దేవుడిని తీసుకొస్తారో? అని సెటైర్లు వేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: