రాజ్ భవన్‌లో శనివారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వా భూసన్ హరిచందన్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ 125 వ జయంతిని జరిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. నేతాజీ భారతదేశం యొక్క గొప్ప కుమారుడని, భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామానికి ఆయన చేసిన కృషిని మరచిపోలేమని గవర్నర్ కొనియాడారు. మహాత్మా గాంధీ పిలుపునిచ్చిన క్విట్ ఇండియా ఉద్యమానికి లక్షలాది మంది స్వాతంత్య్ర సంగ్రామంలోకి దూసుకెళ్లారని గవర్నర్ హరిచందన్ అన్నారు. నేతాజీకి మహాత్మా గాంధీ పట్ల ఎంతో గౌరవం ఉన్నప్పటికీ, మహాత్మా గాంధీని స్వాతంత్ర్య ఉద్యమంలో గొప్ప నాయకుడిగా అంగీకరించినప్పటికీ శాంతియుత నిరసనలను నమ్మలేదని తెలిపారు. శక్తివంతమైన బ్రిటీష్ శక్తిని శాంతియుత మార్గాల ద్వారా దేశం నుంచి తరిమికొట్టలేమని నేతాజీ గట్టిగా నమ్మేవారని, సాయుధ పోరాటం అవసరమని అభిప్రాయపడ్డారని గవర్నర్ తెలియజేశారు. అప్పుట్లో నేతాజీ తన స్థావరాన్ని సింగపూర్‌కు మార్చారని, ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటు చేశారన్నారు. బ్రిటిష్ సంకెళ్ళ నుంచి భారతదేశం విముక్తి కోసం జర్మనీ, జపాన్‌లతో చేతులు కలపడం ద్వారా బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా సైనిక పోరాటం చేశారని గవర్నర్ తెలియజేశారు.
                                                                          భారతదేశం స్వేచ్ఛాయుతమైన దేశమే కాదు, సైనికపరంగానూ ఆర్ధికంగా ప్రపంచంలోని పెద్ద శక్తివంతమైనదని గవర్నర్ హరిచందన్ తెలిపారు. మన స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాల వల్ల సంపన్న దేశంగా మారిందని అన్నారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి నేతాజీ చేసిన పోరాటం యువతను బాగా ఆకర్షించిందన్నారు. ఆ రోజుల్లో నేతాజీ ఒక సంచలనం అన్నారు. ‘‘నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను’’ అని దేశ యువతకు నేతాజీ పిలుపునిచ్చారని వివరించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, జాయింట్ సెక్రటరీ ఎ. శ్యామ్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ, అధికారులు, సిబ్బంది నేతాజీకి నివాళులర్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: