గ‌వ‌ర్న‌ర్‌కు అవ‌మానం

ప్ర‌జ‌ల చేత‌, ప్ర‌జ‌ల కొర‌కు ఎన్నుకోబ‌డిన ప్ర‌తినిధులు వారంతా. త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఓట్లు వేసి శాస‌న‌స‌భ‌కు పంపిస్తే రాజ్యాంగ‌బ‌ద్ధ ప‌ద‌విలో ఉన్న‌వారిపై అనుచితంగా ప్ర‌వ‌ర్తించారు. సాక్షాత్తూ గ‌వ‌ర్న‌ర్‌నే అవ‌మానించారు. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో ప్రతిపక్ష నేత సహా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు స్పీక‌ర్ సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే మార్చి 20వ తేదీ వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా, సస్పెండైన వారిలో ప్రతిపక్ష నేత ముకేష్ అగ్నిహోత్రి, ఎమ్మెల్యేలు హర్ష్ వర్ధన్ చౌహాన్, సుందర్ సింగ్ ఠాకూర్, సత్పాల్ రైజదా, వినయ్ కుమార్ ఉన్నారు.  గవర్నర్‌ను నెట్టేసిన ఘటనపై హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సంఘ‌ట‌న‌ను ఖండించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేయడాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. సమస్యలపై ప్రశ్నిస్తే వేటు వేస్తారా అని ప్ర‌శ్నించింది.  గవర్నర్ తన ప్రసంగంలో అబద్ధాలను చ‌దివార‌ని ఆ పార్టీ ఆరోపించింది.

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఉదయం గవర్నర్ దత్తాత్రేయ అసెంబ్లీకి హాజరయ్యారు. సమావేశం మొదటి నుంచే కాంగ్రెస్ సభ్యులు పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడాలంటూ డిమాండ్ చేశారు. నినాదాలు చేస్తూ సభకు ఆటంకం కలిగించారు.  సభలో గందరగోళం నెల‌కొన‌డంతో దత్తాత్రేయ తన ప్రసంగం చివరి వ్యాఖ్యలను చదివి తన ప్రసంగం పూర్త‌యిన‌ట్లు భావించాలంటూ స‌భ నుంచి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించి నెట్టేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. దీనిపై అధికార బీజేపీ సభ్యులు  మండిపడ్డారు. గవర్నర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్మెండ్ చేయాలని బీజేపీ తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌గా స్పీక‌ర్ ఆమోదం తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: