వైసీపీలో పదవుల కోసం ఆశగా ఎదురుచూసే వారి జాబితా చాలా ఎక్కువగానే ఉంది. పదవులు ఖాళీ అవుతూంటే తమకో చాన్స్ ఇస్తారా అని వారంత ఎదురుచూడడం పరిపాటిగా మారింది. ఇదిలా ఉండగా పెద్దల సభకు నాలుగు పోస్టులు ఖాళీ అయ్యాయి.

వాటిని గవర్నర్ కోటాలో భర్తీ చేస్తారు. ఈ నాలుగు పదవులకు వైసీపీ అధినాయకత్వం నలుగురిని ఎంపిక చేసింది, మోషేను రాజు (పశ్చిమ గోదావరి), లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), ఆర్వీ రమేశ్ యాదవ్ (కడప), తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి)తో ఈ ఖాళీలు భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. వీరి పేర్లను ప్రతిపాదిస్తూ ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్‌కు ఫైలు పంపినట్టు సమాచారం. వీటికి  గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీటికి ఆమోదం తెలిపితే వారు ఎమ్మెల్సీలు అయినట్లే.

ఇదిలా ఉండగా చాలా మంది రేసులో ఉన్నారు. ఆ నలుగురు ఎవరో తెలియడంతో మిగిలిన వారు తెగ నలిగిపోతున్నారు. వైసీపీలో ఇపుడు చాలా పెద్ద జాబితాయే ఉంది. విశాఖ జిల్లా నుంచి చూసుకుంటే నర్శీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి తమ్ముడు సన్యాసిపాత్రుడు ఎన్నికల ముందు వైసీపీలో చేరి పార్టీ విజయానికి కృషి చేశారు. ఆయనకు ఎమ్మెల్సీ ఆశ పెట్టారని ప్రచారంలో ఉంది. అలాగే ఇదే జిల్లా నుంచి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా పెద్దల సభలో అడుగుపెట్టాలనుకుంటున్నారు. అలాగే మైనారిటీ కోటాలో మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎ రహమాన్ కూడా ఈ పదవి మీద ఆశలు పెట్టుకున్నారు.

మరో వైపు చూస్తే నెల్లూరు జిల్లా నుంచి మాజీ మంత్రి సిధ్ధా రాఘవరెడ్డితో పాటు గుంటూరు నుంచి మోదుగుల వేణుగోపాలరెడ్డి, క్రిష్ణా జిల్లా నుంచి దేవినేని అవినాష్, కర్నూల్ నుంచి బైరెడ్డి సిద్ధార్ధ వంటి వారు ఎమ్మెల్సీ పదవులను ఆశించారు. దళిత నాయకుడు జూపూడి ప్రభాకరరావు కూడా ఎమ్మెల్సీ కావాలని చూస్తున్నారు.  అదే విధంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు మొదటి నుంచి పార్టీలో ఉన్న వారు కూడా ఈ పదవి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.  ఇపుడు వీరంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. తమకు పెద్దల సభలో కూర్చునే మహద్భాగ్యం దక్కుతుందా లేదా అన్నదే వీరి వేదన. అయితే వీరికి ఇంకా ఆశలు ఇంకిపోలేదు. ఎమ్మెల్యే కోటాలో అయిదు, లోకల్ బాడీ ఎన్నికల కోటాలో మరో ఎనిమిది పదవులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి వాటిలో  అయినా వీరిలో ఎవరికి దక్కుతాయో లేదో చూడాలి.






మరింత సమాచారం తెలుసుకోండి: