చైనా ఇప్పడు ప్రపంచంలోనే మహా శక్తిగా మారుతోంది. అన్ని విధాలుగా ఓ సూపర్ పవర్‌గా రూపొందుతోంది. కానీ.. ఇదే సమయంలో చైనాలో జరిగే అరాచకాలు కూడా అన్నీ ఇన్నీ కావు. కరోనా వైరస్ చైనా నుంచే పుట్టిందన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు.. ఇది సైన్స్ పేరుతో జరిగిన ప్రయోగాల అరాచకం కారణంగా పుట్టిన వైరస్ అని ఇప్పుడు ప్రపంచం నమ్ముతోంది. సైన్స్, టెక్నాలజీ, సామాజిక రంగాలు.. ఇలా అన్నింటిలోనూ చైనాలో అరాచకాలు జరుగుతున్నాయి.

ప్రధానంగా చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన దారుణంగా జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. అసలే అది కమ్యూనిస్టు దేశం కావడంతో.. ఇలాంటి విమర్శలు ఎన్ని వచ్చినా లెక్క చేయదు. అంతే కాదు.. అరాచకాలు ఆపే అవకాశమూ తక్కువే. అయితే చైనా అరాచకాలను ప్రపంచం ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల కూటమి అయిన జీ7 ఇటీవల చైనా తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.

చైనాలోని షిన్‌జియాంగ్‌ ప్రావిన్సులో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. దీన్ని జీ7 దేశాలు ఖండించాయి. అలాగే హాంకాంగ్‌ స్వయం ప్రతిపత్తి అంశంపైనా జీ7 దేశాలు స్పందించాయి. వీటితో పాటు తైవాన్‌లో శాంతి సామరస్యాలపైనా  చర్చించాయి. చైనా తీరును ప్రత్యేకంగా  ప్రస్తావించిన జీ7 దేశాలు చైనా మానవ హక్కులను గౌరవించాలని  వ్యాఖ్యానించాయి. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ ఇక్కడే చైనా ఆ జీ7 దేశాలకు ఓ ఝలక్ ఇచ్చింది.

జీ7 కూటమి ప్రకటన తమ దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమేనని  చైనా ఘాటుగా కామెంట్ చేసింది. వివిధ అంశాలపై తమ తీరును తప్పుపడుతూ  జి7 దేశాల కూటమి చేసిన ప్రకటనను చైనా తీవ్రంగా ఖండించింది. ఇలా చైనాపై నిందలు వేయడం ఆపాలని విజ్ఞప్తి చేసింది. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో ఘర్షణ వాతావరణం సృష్టించకుండా అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేసే చర్యలు చేపట్టాలని జి7 కూటమికి  చైనా కౌంటర్ ఇచ్చింది. తమ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చవద్దని.. హెచ్చరించింది. చైనా విషయంలో జీ 7 కూటమి దేశాలు వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని  మండిపడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: