ఆమధ్య ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్నాయని, హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని, రథాలు తగలబెడుతున్నారని బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. పెద్ద ఉద్యమమే లేవదీశారు. తిరుపతి నుంచి యాత్ర మొదలు పెట్టాలనుకున్నా కరోనా వల్ల అది సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు మరోసారి అలాంటి వివాదమే మొదలైంది. ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు మరోసారి రాజకీయ రచ్చకు కారణం అయింది. వైసీపీని టార్గెట్ చేస్తూ బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం మొదలు పెడతామని హెచ్చరించింది.

ప్రొద్దుటూరు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద రెడ్డి, టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక జిన్నారోడ్డు సర్కిల్ లో దీనికోసం భూమి పూజ కూడా చేశారు. అయితే దీన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టిప్పు సుల్తాన్ స్వాతంత్ర సమరయోధుడంటూ ఎమ్మెల్యే రాచమల్లు చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అందులోనూ సీఎం జగన్ సొంత జిల్లాలో ఈ విగ్రహం ఏర్పాటు మరింత కలకలం రేపుతోంది.

ఆమధ్య కర్నాటకలో టిప్పు సుల్తాన్ జయంతి కార్యక్రమాల్ని అడ్డుకున్నారు బీజేపీ నేతలు. టిప్పు సుల్తాన్, హిందువుల్ని ఇబ్బంది పెట్టాడని, భారత స్వాతంత్ర సమరంలో ఆయన పాత్ర లేదనేది బీజేపీ వాదన. అలాంటి వ్యక్తి విగ్రహం పెట్టే బదులు, అబ్దుల్ కలాం విగ్రహం పెట్టొచ్చుకదా అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడుతున్నారు.

ప్రొద్దుటూరులో వైసీపీ నేతల మద్దతుతో ఈ విగ్రహం ఏర్పాటుకాబోతుండటంతో బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్.. హిందువుల మనోభావాలను గౌరవించడంలేదని, ఇప్పుడు టిప్పు విగ్రహంతో.. ఆయన ఎవరిపక్షమో అర్థమైపోయిందని అన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు టిప్పు సుల్తాన్ విగ్రహానికి వ్యతిరేకంగా ఆందోళన మొదలు పెట్టారు. దీంతో మరోసారి ఏపీ రాజకీయాలు మతం రంగు పులుముకున్నాయనే విషయం అర్థమవుతోంది. గతంలో హిందూ దేవాలయాల ఘటనలు జరిగిన సమయంలో కూడా ఏపీలో ఇలాంటి ఉద్విగ్న వాతావరణమే ఉంది. ఇప్పుడు మరోసారి టిప్పు సుల్తాన్ విగ్రహం విషయంలో అలాంటి పరిస్థితులే నెలకొంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: