
ఓ రాష్ట్రాన్ని నడిపే పద్ధతి ఇది కాదు. వినియోగం పెరుగుతుంది కనుకనే కోతలు అని చెప్పడం భావ్యం కాదు. ఏదేమైనప్పటికీ అనుకున్నది సాధించాలి. కోతలను నివారించాలి. విద్యుత్ కోతల పేరిట ఇద్దరూ అంటే మోడీ, జగన్ రాష్ట్రానికి చేస్తున్నదేమీ లేదనే నిపుణులు చెబుతున్న మాట. బొగ్గు గనుల ఓపెన్ బిడ్డింగ్ తో ఒడిశా , ఛత్తీశ్ గఢ్ రాష్ట్రాలలో బొగ్గు గనులు దక్కించుకున్న అదానీకి లాభం చేకూర్చే పనులే మోడీ చేస్తున్నారు. జగన్ రేపు చేయనున్నారు. సింగరేణి బొగ్గు ఇటుగా రాకపోవడానికి కారణం కూడా జగనే! బకాయిలు తీర్చకుండా బొగ్గు కొనుగోలుకు నిధులివ్వక కాలయాపన చేసిన కారణంగానే ఈ అవస్థలు తలెత్తాయని తెలుస్తోంది. విద్యుత్ విషయమై కేంద్రంతో కలిసి నడవాలనుకోవడం నిజంగానే పెద్ద తప్పిదం. రేపటి వేళ అదానీలే మన రాష్ట్రంపై సవారీ చేయడం ఖాయం.
మిగులు విద్యుత్ తో ఉండాల్సిన రాష్ట్రం పక్క రాష్ట్రాల నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందని? గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేడి బొగ్గు గనుల నుంచి మన విద్యుత్ ప్లాంట్లకు సంబంధిత ముడి ఖనిజం ఎందుకు ఉత్పత్తి కావడం లేదని? ఒప్పందాల కారణంగానే అధికారులు అలసత్వం వహిస్తే ఆ పాపం గత ప్రభుత్వానిదే అని ఎలా అంటారు ? అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన గత్యంతరం ఎందుకొచ్చింది. థర్మల్ విద్యుత్ పై ఇప్పటికిప్పుడు పరుగులు తీసి ఏం సాధిస్తారు? ఇవన్నీ ప్రశ్నలే కానీ జగన్ సమాధానం చెప్పలేరు.
ఆంధ్రావనిలో కోతల కాలం వచ్చింది. ఇప్పటికే విద్యుత్ పంపిణీకి, ఉత్పత్తికి మధ్య ఉన్న భారీ తేడాకు అనుగుణంగా విద్యుత్ కోతలు షురూ కానున్నాయి. ముందు గృహావసరాలకు ఇచ్చాక తరువాత పరిశ్రమలకు ఇస్తామని చెప్పినా, రేపటి వేళ ఇవేవీ అమలు కావని తేలిపోయింది. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు ముందు కోతలు షురూ చేశాకే, గృహాలకు కూడా నెమ్మది నెమ్మదిగా కోతలు మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఇవన్నీ అమలు కాకపోయినా త్వరలోనే గృహావసరాలకు సైతం నాలుగు గంటల పాటు కోతలు ఉండనున్నాయని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పరిశ్రమలకు కోతలు షురూ అయ్యాయి. మంగళవారం నుంచి రాత్రి ఎనిమిది నుంచి పది గంటల వరకూ విద్యుత్ కోతలకు సంబంధించి స్పష్టమయిన సమాచారం ముందుగానే ఇచ్చారు ఇక్కడి అధికారులు. అదేవిధంగా నెమ్మది నెమ్మదిగా కోతల సమయం కూడా పెంచనున్నారనే తెలుస్తోంది.