ప్రముఖ సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి హఠాత్తుగా శివైక్యం చెందారు. ఆయన గుండెపోటుతో హైదరాబాద్‌లో హఠాన్మరణం చెందారు. గుండెపోటు వచ్చిన ఆయన్ను కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ములుగు రామలింగేశ్వర సిద్ధాంతికి ప్రముఖ జ్యోతిష నిపుణుడిగా పేరుంది. ఆయన చెప్పే వార ఫలాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆయన అనేక టీవీ ఛానల్లలో వార ఫ‌లాలు చెబుతుంటారు.


ములుగు జ్యోతిష్యంపై ఎందరికో మంచి గురి ఉంది. ప్రముఖ పంచాగకర్తగా ములుగు రామలింగేశ్వర సిద్ధాంతిగా చాలా మందికి చేరువ‌య్యారు. ములుగు చెప్పే రాశి ఫలాల‌ను తెలుగు రాష్ట్రాల వారే కాకుండా ఇతర దేశాల్లోని తెలుగు వారు కూడా నమ్మకంగా ఫాలో అవుతారు. ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి దాదాపు 4 దశాబ్ధాలపాటు జ్యోతిష రంగంలో సేవలు అందించారు. ఆయన విడుదల చేసే పంచాంగం ఎంతో ప్రాచుర్యం పొందింది.


అయితే.. ఇక్కడ ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గురించిన ఓ విశేషం ఉంది. ఆయన గుంటూరు జిల్లాకు చెందిన వారు.. అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిర‌ప‌డ్డారు. జ్యోతిష రంగంలోకి రాక ముందు ఆయన మిమిక్రీ కళాకారుడిగా కూడా పేరు తెచ్చుకున్నారన్న విషయం చాలా మందికి తెలియదు.. ఇప్పటిలా టీవీలు, స్మార్ట్ ఫోన్లు రాని కాలంలో ఆయన రూపొందించిన శ్రీదేవి పెళ్లి క్యాసెట్‌ బాగా ప్రాచుర్యం పొందింది. అప్పట్లో ఎక్కడ ఏ టేపు రికార్డురులో విన్నా ఈ క్యాసెట్ బాగా వినిపించేది.  


ఆ తర్వాత ఆ క్యాసెట్‌ను అనుసరిస్తూ అనేక క్యాసెట్లు కూడా వచ్చాయి. అయితే.. అప్పట్లో ఆయన పేరు ఎం. ఆర్. ప్రసాద్‌గా ఉండేది. ఆ తర్వాత జ్యోతిష రంగంలోకి వచ్చి బాగా పేరు తెచ్చుకున్నారు. ములుగు సిద్ధాంతి శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించారు కూడా. అక్కడ వేదాలలో, పూజా, హోమాది క్రతువులలో శిక్షణపొందిన బ్రాహ్మణులతో హోమాలు చేయించేవారు. ములుగు సిద్ధాంతి హఠాన్మరణంపై  ఎందరో ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: