జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయటానికి నిర్దిష్టమైన అంశాలు ఏమీ ఉన్నట్లు లేవు. అందుకనే ఏమిచేయాలో తెలుగుదేశంపార్టీకి అర్ధంకాక బ్రహ్మోత్సవాలను వేదికగా చేసుకుని గోల మొదలుపెట్టింది. తిరుమలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి. ఇందులో భాగంగానే జగన్ తిరుమలకు చేరుకున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న తెలుగుదేశంపార్టీ జగన్ హిందు వ్యతిరేకి అనే గోల మళ్ళీ మొదలుపెట్టింది.


‘హిందు సంప్రదాయం ప్రకారం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సహధర్మచారిణితో కలిసి జగన్ పట్టువస్త్రాలు ఇస్తాడా ? లేదా’ ? అనే ప్రశ్నను లేవదీసింది. సమాధానాల కోసమని ఏకంగా ట్విట్టర్లోనే ఒపీనియన్ పోల్ కూడా మొదలుపెట్టింది. ఏ-ఇస్తాడు..బీ-ఇవ్వడు అనే ఆప్షన్ కూడా ఇచ్చింది. ఇక్కడ టీడీపీ నేతల సమస్య ఏమిటంటే ఎలాగైనా జగన్ను తిరుమల శ్రీవారి దర్శనానికి రాకుండా ఆపాలన్నది ఆలోచన. అయితే ఆపని వాళ్ళు చేయలేకపోతున్నారు.


ముఖ్యమంత్రి హోదాలో జగన్ను తిరుమల రాకుండా అడ్డుకునేంత సీన్ తమకు లేదని తమ్ముళ్ళకి బాగా తెలుసు. ఒకవేళ అడ్డుకునే ప్రయత్నంచేస్తే ఏమవుతుందో కూడా బాగా తెలుసు. అందుకనే సీఎంపై హిందు వ్యతిరేకి అనే ముద్రవేయాలని చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. స్వామివారి దర్శనానికి, పట్టువస్త్రాల సమర్పణకు జగన్ ఒక్కళ్ళే వస్తే ఏమిటి ? భార్యతో కలిసి వస్తే ఏమిటి ? గతంలో కూడా మూడుసార్లు ఇలాంటి పనికిమాలిన గోల చేసి అబాసుపాలైంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా జగన్ చాలాసార్లు తిరుమల స్వామివారి దర్శనం చేసుకున్నారు. అప్పుడెప్పుడు తమ్ముళ్ళు అసలే పట్టించుకోనేలేదు. కానీ సీఎం అయిన తర్వాతే గోల మొదలుపెట్టారు.


జగన్ హిందు వ్యతిరేకి అని తమ్ముళ్ళు గోలచేయటమే కానీ మామూలు జనాలు ఎవరూ పట్టించుకోలేదు. అరచి అరచి ఏమీ చేయలేక అప్పట్లో వదిలేశారు. అలాంటిది ఇపుడు అలాంటి గోలనే మళ్ళీ మొదలుపెట్టారు. అంటే జగన్ పై ఆరోపణలు చేయటానికి తమ్ముళ్ళకు ఇంకే అంశమూ లేనట్లుంది. అందుకనే స్వామివారి దర్శనానికి జగన్ భార్యకు ముడేస్తున్నారు. ట్విట్టర్లో ఓటింగ్ పెట్టడమే కాకుండా మీడియా సమావేశాల్లో గోలకూడా మొదలుపెట్టారు. పాపం తమ్ముళ్ళ గోల ఎప్పటికి తీరుతుందో ఏమో అర్ధంకావటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: