ఎన్నికల్లో ఓటమి చెందినా ముఖ్యమంత్రి కి తమపై నమ్మకం ఉంటే కేబినెట్ పదవి దానంతట అదే నడుచుకుంటూ వచ్చి వరిస్తుందని ఏపీ కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్న మోపిదేవి వెంకట రమణ చూస్తే చూస్తే స్పష్టం కాగా ...ఇప్పుడు తెలంగాణ లోను అటువంటి వైచిత్రి నే చోటు చేసుకుంది . ఇటీవల జరిగిన లోక్ సభ  ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన బోయినపల్లి వినోద్ కుమార్ అనూహ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్  హోదా కలిగిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు పదవిని కట్టబెట్టారు.


  రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షులుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తుండగా,  ఉపాధ్యక్షుడు వంటి కీలకమైన  పదవిని ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి కట్టబెట్టడం ఏమిటంటూ టీఆరెస్ నేతల్లో సన్నాయి నొక్కులు నొక్కే వారు లేకపోలేదు .  అయితే వినోద్ కుమార్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న విశ్వాసమే  ఆయనకు  ఈ పదవి కట్టబెట్టేలా చేసిందని  పార్టీ వర్గాలు అంటున్నాయి .  రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రణాళికాసంఘం అత్యంత కీలకమైనది  కావడంతో,  అనుభవజ్ఞుడైన  వినోద్ కుమార్ కు  ఉపాధ్యక్ష పదవి కట్టబెడితే బాగుంటుందని కెసిఆర్ భావించి ఉంటారని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.


 రాజకీయాల్లో,  పాలన అంశాల్లో వినోద్ కు అనుభవంతో పాటు,  తెలంగాణ రాష్ట్ర భౌగోళిక , సామాజిక , ఆర్థిక అంశాల మీద  గట్టి పట్టు ఉండటం వల్ల ఆయన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు గా నియమించి  ఉంటారని వారు అంటున్నారు.  బడ్జెట్ కు సంబంధించిన అన్ని శాఖల  ప్రతిపాదనలు  సమీక్షించి బడ్జెట్ కు తుది రూపం ఇచ్చే   బాధ్యతను కూడా కేసీఆర్ ,  వినోద్ కు అప్పగించడం చూస్తే  ఆయనపై ఎంత నమ్మకం ఉందో ఇట్టే అర్థం అవుతుందని అంటున్నారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: