ఇంటర్నెట్ డెస్క్: సొంత ఇల్లు చాలామందికి కల. ఎంతో కష్టపడి ప్రతి రూపాయి కూడబెట్టి ఇల్లు కొనుక్కుంటారు. అలా కష్టపడి కొనుక్కున్న ఇంట్లో ఉన్నట్లుండి భయంకరమైన రహస్యం ఒకటి బయటపడితే..? దాని గురించి పాత యజమాని మనకు చెప్పకుండా వెళ్లిపోతే..? సరిగ్గా అలాంటి పరిస్థితే ఎదురైంది. అమెరికాలోని ఓ మహిళకు. సంవత్సరం క్రితం ఓ ఇంటిని ఆమె కుటుంబం కొనుగోలు చేసింది. అక్కడకు షిఫ్ట్ అయ్యారు. అంతా హ్యాపీగా గడిచిపోతోంది. అయితే ఓ సంవత్సరం తరువాత ఇంటిని శుభ్రం చేస్తుండగా.. కార్పెట్ కింద ఏదో ఉన్నట్లు ఆమెకు అనిపించింది. వెంటనే కార్పెట్ తొలగించి అదేంటో పరిశీలించింది. అదో బేస్ మెంట్ రూం. దానిని చూడగానే ఆమె షాక్ అయింది. ఎందుకంటే దాని గురించి ఆమెకు పాత ఓనర్ చెప్పలేదు.

బేస్ మెంట్ చూడగానే కొద్దిగా భయపడినా.. ధైర్యం చేసి ఆ తలుపు తెచిరి కిందకు వెళ్లింది. అందులో పాత ఫర్నిచర్‌తో పాటు చాలా చెత్తా చెదారం పేరుకుపోయి ఉంది. అంతేకాదు అందులో మరికొన్ని గదులున్నాయి. వాటిని చూసిన ఆమెకు గుండె ఆగినంత పనైంది. అవన్నీ చాలా భయానకంగా ఉన్నాయి. వాటి లోపలికి వెళ్లడం సరికదా.. కనీసం వాటి దగ్గరకు కూడా వెళ్లేందుకు ఆమె సాహసించలేకపోయింది. వెంటనే వెనక్కి తిరిగి వచ్చేసింది.

ఈ క్రమంలోనే ఆ బేస్ మెంట్‌ను మొత్తం ఆమె వీడియో తీసింది. అందులో తన అనుభవాలను చెబుతూ.. ఆ బేస్ మెంట్‌ని చూపిస్తూ తన టిక్ టాక్ ఖాతా  @Unfortunateexistanceలో పోస్ట్ చేసింది. సంవత్సరం క్రితం ఈ ఇల్లు కొన్నామని, అప్పుడు ఈ బేస్ మెంట్ గురించి తనకు తెలియలేదని, కొనేముందు ఇంటిని పూర్తిగా చెక్ చేసుకునే అవకాశం రాలేదని ఆ వీడియోలో తెలిపింది. అంతేకాకుండా ఆ ఇంటి పాత యజమానులు ఇక్కడి నుంచి వీలైనంత త్వరగా వేరే ప్రదేశానికి మారిపోవాలని భావించారని, అందుకే చాలా తక్కువ ధరకే ఇంటిని తమకు అమ్మేశారని, దాంతో ఇంటిని కొనే ముందు పూర్తిగా పరిశీలించలేదని వెల్లడించింది. ఇప్పుడు ఈ బేస్ మెంట్‌ను చూస్తే భయమేస్తోందని, లోనికి వెళ్లేందుకు ధైర్యం చాలడం లేదని చెప్పింది.

ఇదిలా ఉంటే ఆమె పోస్ట్ చేసిన వీడియోను ఒకటిన్నర కోట్ల మంది వీక్షించారు. లక్షల మంది షేర్ చేసి కామెంట్లు చేశారు. ఇలాంటి బేస్ మెంట్లను చూస్తే చాలా భయంగా ఉంటుందని కొందరు కామెంట్ చేస్తే.. మరికొందరేమో తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: