చింతకింది మల్లేశం. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లా ఆలేరు మండలం శారాజీపేట అనే ఒక మారుమూల గ్రామీణ నేతకారుడు. నిరుపేద చేనేత కుటుంబం. రోజంతా పనిచేస్తే గానీ రాత్రికి పళ్లెంలో నాలుగు మెతుకులు కనిపించవు. ఒక చీర ఆసు పోయడానికి దారాన్ని పిన్నుల చుట్టూ 9వేల సార్లు (12-13 కిలోమీటర్ల దూరం) అటూ ఇటూ తిప్పాలి. అలా రోజికి 18వేల సార్లు దారాన్ని కండెల చుట్టూ తిప్పితేగానీ(25కి.మీ దూరం) రెండు చీరలు తయారుకావు. మెడ లాగేస్తుంది. వేళ్లు పీక్కుపోతాయి. భుజం పట్టేస్తుంది. కంటిచూపు దెబ్బతింటుంది. తల్లి పడుతున్న బాధ మల్లేశాన్ని కదిలించింది. తల్లిని ఆ గండం నుంచి గట్టెక్కించాలన్న ఆలోచన వచ్చింది. ఒక మెషీన్ లాంటిది కనిపెడితే ఎలా వుంటుందీ అని అనుకున్నాడు. చేనేత కుటుంబాలతో ఐడియా షేర్ చేసుకున్నాడు. కానీ వాళ్లు అది అయ్యేపనికాదు వదిలేయ్ అన్నారు. టెక్నికల్ నాలెడ్జ్ లేదని నిరుత్సాహ పరిచారు. దానికయ్యే ఖర్చు గురించి ఆలోచించావా అని హెచ్చరించారు. అయినా మల్లేశం ఆశ సజీవంగా వుంది. సాధించి తీరుతాననే నమ్మకం ఉంది. ఇక్కడే ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని హైదరాబాద్ వచ్చాడు. అక్కడే ఒక పార్ట్ టైం జాబ్ చూసుకున్నాడు. 

 

మనసంతా ఆసుయంత్రం మీదనే ఉంది. పరిశోధిస్తూ, ఒక్కో కాంపోనెంట్ జతచేసుకుంటూ, ఆలోచనలకు పదును పెడుతూ పోయాడు. పార్టులు పార్టులుగా యంత్రాన్ని తయారుచేశాడు. ఏడేళ్లు గడిచేసరికి అనుకున్నట్టే యంత్రం కొలిక్కివచ్చింది. పనిచేస్తోంది. ప్రాణాలు లేచివచ్చాయి. ఇంటిదగ్గర తల్లి కళ్లముందు కదలాడింది. అమ్మకు ఇక ఎలాంటి కష్టం ఉండదని కళ్లు చెమ్మగిల్లాయి. ఇది ఒక్క తన తల్లికోసమే కాదు.. తన ఊరిలో చేనేత కుటుంబాల్లో ఎందరో తల్లులు కిలోమీటర్ల దూరం పొడవుంటే కండెల్ని చుడుతూ రోజంతా నరకయాతన పడుతున్నారు. వాళ్ల బాధలను గట్టెక్కించాలని తపన పడ్డాడు. మిషన్ అంటే యంత్రాలతో హడావిడిగా వుండదు. రెండు తక్కువ కెపాసిటీ గల మోటార్లు, వుడ్ ఫ్రేమ్. అంతే. దీని ద్వారా ఎలాంటి ఫిజికల్ స్ట్రెయిన్ లేకుండా ఒక చీరకు అవలీలగా ఆసు పోయవచ్చు. అలా ఒకరోజులో ఇంటిపని వంటపని చూసుకుంటూనే వీలైనన్ని చీరలకు ఆసుపోయవచ్చు. టైం చాలా ఆదా అవుతుంది. ప్రొడక్షనూ పెరుగుతుంది. రోజులో రెండు చీరలు నేసేవాళ్లు ఈ యంత్రం వచ్చాక 6-7 నేస్తున్నారు. మామూలు ఆసు యంత్రం ద్వారా ఒక చీర నేయడానికి 5-6 గంటలు పడుతుంది. ఈ మిషన్ ద్వారా అయితే గంటన్నరలో అయిపోతుంది.

 

తల్లి భుజం కోసం పడిన శ్రమ అందరి జీవితాలను భుజాన వేసుకునేలా చేసింది. ఇప్పటిదాకా 800లకు పైగా ఆసు యంత్రాలను తయారు చేశాడు. ఒక్కోదాని ఖరీదు 25వేలు. మొదట్లో 13వేలకే అమ్మాడు. దేశవ్యాప్తంగా ఆసుయంత్రం కొనుగోలు చేస్తున్నారు. ఆరో తరగతిలోనే చదువు ఆపేసి 8 ఏళ్లు కష్టపడి లక్ష్మీ ఆసుయంత్రం ఆవిష్కరించిన మల్లేశం దేశవ్యాప్తంగానే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. 2000 సంవత్సరంలో ఈ యంత్రాన్ని కనిపెట్టాడు. ఏడాది తిరిగేలోపు 60 మిషన్లు తయారు చేశాడు. 2002 నుంచి 2004 వరకు ఏడాదికి వంద మిషన్ల చొప్పున తయారు చేశాడు. 2006లో మిషన్ కు కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు జతచేశాడు. 2009లో ఆసుయంత్రం ఆసియాలో ద బెస్ట్ అని అమెరికాకు చెందిన పాబ్ లాబ్స్ ప్రశంసించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: