అత్యంత సుల‌భంగా డ‌బ్బు సంపాదించాల‌నే ల‌క్ష్యంతో అక్ర‌మమార్గంగా బంగారం, హెరాయిన్‌, గంజాయి వంటివి అక్ర‌మార్కుల‌కు పెద్ద ఆదాయ వ‌న‌రులనే చెప్పుకోవ‌చ్చు. ఏ చిన్న అవ‌కాశం దొరికినా కానీ వ‌ద‌ల‌కుండా స్మ‌గ్ల‌ర్లు రెచ్చిపోతున్నారు. చిన్న వ‌స్తువులోనైనా సరే బంగారాన్ని దాచి బ‌య‌ట‌ప‌డితే కోటీశ్వ‌రులు అవ్వ‌చ్చొనేది వారి ల‌క్ష్యం. దొరికితే దొంగ‌.. దొర‌క‌క‌పోతే దొర‌లా ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. కానీ కస్ట‌మ్స్ అధికారులు వీరిపై ఓ క‌న్నేసి వీరి ఆట‌ల‌ను సాగినివ్వ‌కుండా త‌నిఖీలు చేప‌డుతున్నారు. ఇలా హైద‌రాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న‌ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వ‌రుస‌గా అక్ర‌మ బంగారం ప‌ట్టుబ‌డుతోంది.  

వివిధ అక్ర‌మ మార్గాల‌ను ఎంచుకొని విదేశాల నుంచి త‌ర‌లించేందుకు య‌త్నించి అడ్డంగా క‌స్ట‌మ్స్ అధికారుల‌కు దొరికుతున్నారు అక్ర‌మార్కులు. తాజాగా దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌ఫోర్ట్‌కు చేరుకున్న ఓ ప్ర‌యాణికుడు బంగారం తెచ్చుకోవ‌డానికి డియోడ‌రెంట్ బాటిల్స్‌, పోర్ట‌బుల్ ఎల‌క్ట్రానిక్ స్కేల్‌, టాయ్‌కార్‌, అలారం వాచ్ వంటి మార్గాల‌లో దాదాపు 320 గ్రాముల బంగారాన్ని దాచుకున్నాడు. వీటి అన్నింటిని  త‌ర‌లిస్తుండ‌గా  క‌స్ట‌మ్స్ అధికారులు అత‌ని బ్యాగ్ చెక్ చేసి ప‌ట్టుకున్నారు.  ప‌ట్టుబ‌డిన బంగారం విలువ దాదాపు రూ.15.75 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచెనా వేశారు అధికారులు. అత‌ని వ‌ద్ద ఉన్న బంగారంతో పాటు టాయ్‌కార్‌, అలారం వాచ్‌, డియోడ‌రెంట్ వంటి వ‌స్తువుల‌ను స్వాధీనం చేసుకున్న క‌స్ట‌మ్స్ అధికారులు నిందితున్ని విచార‌ణ చేప‌ట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: