మరో ఐదారు నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలవడనుంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమి పేరిట సమావేశాలు నిర్వహిస్తూ కామన్ ఎజెండా కోసం ప్రయత్నిస్తూ ఉన్నాయి. మరోవైపు నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి కూడా ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ప్రస్తుతం తెలంగాణ తో పాటు ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఫలితాలు సార్వత్రికానికి సెమీ ఫైనల్ గా భావిస్తున్నారు.


అయితే ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో సత్తా చాటేందుకు బీజేపీ, కాంగ్రెస్ లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.  రాజస్థాన్ విషయానికొస్తే అక్కడ మూడు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం కూడా వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టలేదు. ఈ అంశాన్నే ప్రముఖంగా  ప్రస్తావిస్తూ బీజేపీ ఎన్నికలకు వెళ్లింది.  


ఎన్నికల్లో సంప్రదాయాలు అంటూ ఏమీ ఉండవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రజలు మెచ్చిన పాలకులు అధికారంలో ఉంటారు. నచ్చని వారు ప్రతిపక్షంలో కూర్చొంటారు.  ఉదా.. కేరళలో చాలా ఏళ్లుగా ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి. అక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లు ప్రభుత్వాలను ఏర్పాటు చేసేవి.  కానీ కిందటిసారి ఎన్నికల్లో ఎల్డీఎఫ్  కూటమి రెండో సారి అధికారంలోకి వచ్చి సంప్రదాయాన్ని తిరగరాసింది. ఎందుకంటే ప్రభుత్వాల చేతిలో ఆర్థిక వనరులు పెరిగాయి. వృద్ధి పెరుగుతోంది.  దీంతో జన రంజక సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వారికి అవకాశం లభిస్తోంది.


దిల్లీలో షీలా దీక్షిత్ వరుసగా మూడు సార్లు అధికారం చేపట్టింది. ఆ తర్వాత ఆమె ఓడిపోవడం, కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. దీనికి లెక్కలు అంటూ ఏమీ ఉండవు. ఒకవేళ అలాంటి లెక్కలే తీసుకుంటే కాంగ్రెస్ హయాంలోని యూపీఏ కూటమి పదేళ్లు అధికారంలో ఉండి ఓడిపోయింది. ఇప్పుడు ఎన్డీయే కూటమి అధికారం చేపట్టి పదేళ్లు కావొస్తుంది కాబట్టి ఓడిపోతుందా.  బీజేపీ నాయకులు చెప్పిన రాజస్థాన్ లెక్కల ప్రకారం కేంద్రంలో ఎన్డీయే కూటమి 2024లో ఓడిపోవాలి. మరి ఈ వాదనతో బీజేపీ నాయకులు ఏకీభవిస్తారా?

మరింత సమాచారం తెలుసుకోండి: