తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఉత్కంఠకు తెర దించుతూ కాంగ్రెస్ అధిష్ఠానం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించింది. ఇప్పుడు అందరి చూపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పడింది. కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు చీల్చి ఆ పార్టీని చావు దెబ్బ కొట్టిన కేసీఆర్ ను రేవంత్ వదిలిపెడతారా అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోను మెదులుతున్నాయి.


అయితే మరోవైపు గతంలో కాంగ్రెస్, టీడీపీ సంబంధాలు ఉండి ప్రస్తుతం బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు కొద్దిమంది హస్తం వైపు చూస్తున్నట్లు లీకులు వస్తున్నాయి. అయితే ప్రభుత్వ హడావుడిలో ఉన్న కాంగ్రెస్ వీటిని ఏమీ పట్టించుకోవడం లేదు. పార్టీ మారాలనుకునే వారు బహిరంగంగా దీనిపై ప్రకటన చేయడం లేదు. ఇది సందర్భం కాదు అన్నది వారి వాదన. ఒకవేళ రేవంత్ రెడ్డి ఏ షరతులు విధించకుండా పార్టీలో చేర్చుకుంటారా లేక రాజీనామా చేసి రమ్మంటారా అనేది వారి సందేహం.


2014లో బీఆర్ఎస్ పార్టీ బొటాబొటీ మెజార్టీ తో గట్టెక్కింది. దీంతో రాజకీయ పునరేకీకరణ పేరుతో అటు టీడీపీని, ఇటు కాంగ్రెస్ నేతల్ని కారెక్కించుకున్నారు. 2018లో ఆ పార్టీకి అవసరం లేకున్నా కాంగ్రెస్ నుంచి 12 మందిని, టీడీపీ నుంచి ఇద్దరిని గులాబీ గూటికి చేర్చుకున్నారు. ఇది ఆ పార్టీపై గట్టిగానే ప్రభావం చూపిందని చెప్పవచ్చు.


ఎందుకంటే పార్టీ మారిన 14 మంది ఎమ్మెల్యేల్లో 12మంది ఓడిపోయారు. కేవలం ఇద్దరు మాత్రమే విజయం సాధించారు. వారంతా ప్రజాగ్రహానికి గురయ్యారు. ఇలా చేర్చుకోవడం వల్ల కేసీఆర్ పై కూడా జనాల్లో కొంత వ్యతిరేకత కనిపించింది. ఇప్పుడు అదే తప్పు రేవంత్ రెడ్డి చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ ని బలహీన పరచాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా ఏముంటుంది అని ప్రజల్లోకి వెళ్తుంది. మరోవైపు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ఎమ్మెల్యేలను చేర్చుకుంటే బీఆర్ఎస్ కు లాభిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో ప్రభావం చూపకపోతే రేవంత్ సీఎం సీటుకే ఎసరొస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఎలా వ్యవహరిస్తాడో అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: