జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారంటే చాలు చాలా ఓపెన్ గా మాట్లాడతారు. అది పార్టీ శ్రేణులకు ఉత్సాహంగా ఉంటుంది. కానీ కొన్ని సార్లు అది ఇబ్బందికరంగా తయారవుతుంది.  కానీ పవన్ తన తీరు మార్చుకోరు. ఈ క్రమంలో తాజాగా పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు అంశాలను వారితో పంచుకున్నారు.


ఈ సందర్భంగా ఆయన ఏది మాట్లాడినా జనసైనికులు చప్పట్లు, ఈలలతో ఎంజాయ్ చేస్తుంటారు. ఈక్రమంలోనే ఆయన తన వైఫల్యాలను నవ్వుతూ కవర్ చేస్తుంటారు. జగన్ ని గద్దె దించడమే తన లక్ష్యమని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. జగన్ పై తనకు వ్యక్తిగతంగా ద్వేషం ఏమీ లేదని వివరించారు. ఏపీలో అరాచక పాలన సాగించడం నచ్చలేదని తెలిపారు. అయితే జనసైనికులపై, పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ అక్రమ కేసులు పెట్టి వారిని ఎప్పుడూ ఇబ్బందులకు గురి చేయలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఇంకా టీడీపీ హయాంలో పవన్ సభలకు తన అధికార బలంతో కవరేజ్ లేకుండా చేసిన విషయాన్ని  కూడా జనసేనాని మరిచిపోయారు. ప్రస్తుత వైసీపీ పాలనలో అందరూ స్వేచ్ఛగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. సభలు, సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. కానీ పవన్ కి ఇవేమీ కనిపించడం లేదు. చంద్రబాబు పాలనే నచ్చింది. ఆయన్నే మరోసారి సీఎం చేయాలని ప్రతినబూనారు.


ఇక పొత్తు కారణంగా జరిగిన నష్టం గురించి వివరిస్తూ.. మధ్యవర్తిత్వం వల్ల తనకు, పార్టీకి ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవం అని.. దీని వల్ల కొన్ని సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని పవన్ వివరించారు. మన పెద్ద మనిషిలా వ్యవహరిస్తే వేరే వాళ్ల దగ్గర చిన్న అవుతామనే పాఠం నేర్చుకున్నానని తెలిపారు. ఐతే రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా  ఈసారి కొన్ని త్యాగాలు చేయక తప్పలేదని జనసేనాని పేర్కొన్నారు. అయితే మధ్యవర్తిత్వం.. సీట్లు త్యాగాలు,..పెద్దల దగ్గర చివాట్లు తినాల్సిన అవసరం ఆయనకు ఏం వచ్చిందో ఎవరికీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: