
విశ్వనాధ్ పరిపూర్ణమైన ఆయుష్ తో 92 సంవత్సరాలు జీవించిన ధన్యజీవి. 1951 లో సినిమా రంగంలోకి ప్రవేశించిన విశ్వనాధ్ 1965లో దర్శకుడిగా మారారు. ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఈయన సూపర్ స్టార్ కృష్ణను హీరోగా పరిచయం అయిన ‘తేనెమనసులు’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. మొదట్లో కమర్షియల్ సినిమాలు తీసిన విశ్వనాథ్ కెరియర్ ‘సిరిసిరిమువ్వ’ సినిమాతో మలుపు తిరిగింది.
ఆసినిమా నుండి సంగీతానికి సంప్రదాయాలకు చిరునామాగా ఉండే సినిమాలను మాత్రమే నిర్మించారు. ‘శంకరాభరణం’ సినిమాతో ఆయన ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ‘స్వాతిముత్యం’ ‘సప్తపది’ ‘సాగరసంగమం’ ‘స్వర్ణకమలం’ ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు ఆయన నుండి వచ్చాయి. వేటూరి సిరివెన్నెల లతో అద్భుతమైన పాటలు వ్రాయించారు. ఈయన సినిమాలకు అనేక గౌరవాలు అవార్డులు వచ్చినా ఏనాడు గర్వం అన్నది ఆయన నడవడిలో కాని ప్రవర్తనలో కాని ఎప్పుడు కనిపించేది కాదు.
సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడ ఎప్పుడు వివాదాల జోలికి వెళ్ళకుండా గాసిప్పుల వార్తలలో లేకుండా కేవలం ఆయన వ్యక్తిత్వంతో విపరీతమైన గౌరవాన్ని పొందిన ఏకైక తెలుగు దర్శకుడు విశ్వనాథ్. స్వతహాగా తెలుగు సాహిత్యం అన్నా సాంప్రదాయ కళలు అన్నా విపరీతమైన మక్కువను ప్రదర్శించే విశ్వనాథ్ మంచి ఆధ్యాత్మిక పరుడు కూడ. ప్రతిరోజు పూజ చేయకుండా ఏనాడు ఆయన షూటింగ్ లకు వచ్చేవారు కారు. తెలుగు సినిమా చరిత్రలో విశ్వనాథ్ కు భవిష్యత్ లో ఒక సుస్థిర స్థానం ఆయనది..