కరోనా పరిస్థితులు మధ్య తిరిగి తెలుగు రాష్ట్రాలలో పెళ్ళిళ్ళ సందడి ప్రారంభం అయింది. ఈ వారం నుండి రానున్న మూడు నెలల పాటు పెళ్ళి ముహూర్తాలు ఉండటంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే పెళ్ళిళ్ళకు రంగం సిద్ధం అవుతోంది. చలికాలం రావడంతో పాటు కరోనా సెకండ్ వేవ్ రాబోతోంది అని వస్తున్న హెచ్చరికల మధ్య పరిమిత సంఖ్యలో అతిధుల మధ్య పెళ్ళితంతు కానిస్తూ జరుగుతున్న ఈ పెళ్ళిళ్ళలో కొత్త సాంప్రదాయాలు కనిపిస్తున్నాయి.


క్రితం లా దగ్గర చుట్టాలను స్నేహితులను ఖరీదైన శుభలేఖలు అచ్చు వేయించి ఇచ్చి వ్యక్తిగతంగా ఆహ్వానించే పద్దతికి స్వస్తి పలికారు. కేవలం ఫోన్ చేసి ఆహ్వానిస్తూ వాట్సాప్ లో శుభలేఖలు పంపుతున్నారు. పెళ్ళికి వచ్చే అతిధుల సంఖ్య తగ్గిపోవడంతో చిన్న ఫంక్షన్ హాల్స్ కు డిమాండ్ పెరిగి అవన్నీ మూడు నెలల వరకు బుక్ అవ్వడమే కాకుండా వాటి రేట్లను కూడ విపరీతంగా పెంచేశారు. బయట వారికి క్యాటరింగ్ ఇస్తే ఏమి జరుగుతోందో అన్న భయంతో ఫంక్షన్ హాల్స్ లోను అదేవిధంగా పెళ్ళిళ్ళు జరిగే హోటల్స్ లోను అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పెళ్ళి జరిగే కుటుంబానికి సంబంధించిన వారే స్వయంగా శ్రద్ధ తీసుకుంటూ వంట చేసే వారికి అన్ని పరీక్షలు చేయిస్తు సకల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటంతో క్యాటరింగ్ బిజినెస్ విపరీతంగా నష్టపోయింది అన్న అంచనాలు వస్తున్నాయి.


ఇక మధ్య తరగతి హోటల్స్ కు ఈ సీజన్ లో విపరీతమైన డిమాండ్ ఏర్పడి అవి కూడ రెండు నెలల వరకు బుక్ అయినట్లు తెలుస్తోంది. పెళ్ళికి వచ్చే అతిధులకు గతంలో పూలతో పన్నీరుతో ఆహ్వానిస్తే ఈ కరోనా పరిస్థితులు వల్ల ప్రతి అతిధికి శానిటైజర్లు గ్లౌజ్ లు మాస్క్ లు కిట్ గా చేసి ప్రతి వ్యక్తికి ఒక కిట్టు ఇస్తున్నారట.


అంతేకాదు వంటపని నుండి వడ్డించే వారి వరకు అందరికీ పీపీఈ కిట్స్ ఇవ్వవలసి రావడంతో ఒక మోస్తరి పెళ్ళి చేసుకునే వారి ఖర్చు కూడ 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు పెరిగిందని అంటున్నారు. ఆఖరికి శుభకార్యాలు నిర్వహించే పురోహితులు కూడ ఈ కరోనా సమయంలో వచ్చి ధైర్యంగా పెళ్ళిళ్ళు చేయడానికి అదనంగా అడుగుతున్నారని ఇలా అన్ని ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో అతిధులు తగ్గి ఖర్చులు మరింత పెరిగిపోయాయని ఒక సర్వే తెలియ చేస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: