ఎండలు బాబోయ్ ఎండలు.. కాదు కాదు వానలు బాబోయ్ వానల్.. అవును నిన్న మొన్నటి వరకు మండే ఎండలపై రోజూ అలెర్టులు.  రోజు రోజుకి పెరుగుతున్న ఎండలకు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోయారు. ఇప్పుడేమో.. దంచి కొడుతున్న వర్షాలకు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడేమో రోజూ వానల అలెర్టులు వస్తున్నాయి. ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో వరుణిడి ప్రభావంతో చల్లగా మారిపోయింది.


అయితే ఇప్పుడీ వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తీవ్రమైన ఈదురుగాలులు, వడగళ్లు, పిడుగులు ఇలా చేయాల్సిన నష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎండలతో ఎలా బాబోయ్ అనుకున్న వారంతా ఇప్పుడు కురుస్తున్న అకాల వర్షాలతో తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు సార్వత్రిక ఎన్నికలు మూడు విడతల్లో జరిగాయి. మూడు విడతల్లోను పోలింగ్ శాతం తక్కువ అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.


ఎండల ప్రభావంతోనే ఈ పోలింగ్ తగ్గినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓ పక్క అభ్యర్థులు సైతం ఎండకు తాళలేక ప్రచారాన్ని పక్కన పెట్టేశారు. ఉదయం, సాయంత్రం వేళ సమీప గ్రామాలను చుట్టుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పోలింగ్ శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతో తెలంగాణలో పోలింగ్ సమయాన్ని ఓ గంట పాటు పెంచింది. ఇప్పుడు అనూహ్యంగా మారిన వాతావరణంతో అభ్యర్థుల్లో మరో టెన్షన్ మొదలైంది. పోలింగ్ రోజు బీభత్సమైన ఈదురు గాలులు, వర్షం ఉంటే పోలింగ్ కు ఓటర్లు రారేమో అనే భయాందోళనలో ఉన్నారు.


అయితే వీరికి వాతావరణ శాఖ ఉపశమన వార్త వినిపించింది. విదర్భ నుంచి చెన్నై వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ఫలితంగా తెలంగాణ, ఏపీలో ఘణనీయంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. 12వ తారీఖు అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉంది. పోలింగ్ రోజు వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని.. ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది. దీంతో రాజకీయ నాయకులు ఖుషీ అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: