ఏపీలో ఎన్నికల వేళ పలు ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకుంటున్నాయి. అవును, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొంతమంది అధికారులు ప్రజలకు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వివిధ రకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇక దానికోసం కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు అయితే ఓటర్లకు చైతన్యం కలిగించే అనేక రకాలైన కార్యక్రమాలను నిర్వహిస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏలూరు జిల్లా ఉపాధి అవకాశాల శాఖ (డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్) కాస్త వెరైటీగా 'ప్రజాస్వామ్య పండుగ సాధారణ మరియు అసెంబ్లీ ఎన్నికలు 2024' పేరిట ఓ ఆహ్వాన పత్రికను ముద్రించి వాటిని ప్రజలకు పంపిణీ చేస్తోంది. కాగా ఈ పత్రిక ఇపుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.

కేవలం ఓటర్లను చైతన్య పరచడమే ధ్యేయంగా కొత్తగా అలోచించి ఈ ప్లాన్ చేయడం జరిగింది. ఇక ఇందులో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు కూడా జరగబోయే ఓట్ల పండుగకు మీ కుటుంబంలోని అర్హులందరూ ఓట్లు వేసేందుకు తప్పనిసరిగా రావాలని ఆహ్వానిస్తున్నట్లు ముద్రించిన ఆహ్వాన పత్రికలో తెలిపారు. వీటితో పాటు ఈ వేడుకకు హాజరై ఫలాలను అందుకోవాలని ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలంటూ ఆహ్వాన పత్రికలో పేర్కోవడం విశేషం. అయితే ఇలా చేయడానికి కారణం లేకపోలేదు.

అవును, మే 13న రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసినదే. జరగబోయే ఈ పోలింగ్ లో పాల్గొని ప్రజలు వారి ఎంపీలను, యం యల్ ఏలను ఎన్నుకోవాలంటూ సూచించారు. పోలింగ్ స్టేషన్లో నిర్వహించే ఓటింగ్ ప్రక్రియకు ప్రజలు హాజరైతే ప్రభుత్వం అందించే ఫలాలను కూడా అందుకోవచ్చని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఓట్ల పండుగకు వచ్చే ప్రతి ఒక్కరు ఓటు వినియోగించేందుకు తప్పనిసరిగా ఫోటో గుర్తింపు కార్డును తీసుకురావాలంటూ సూచించారు. ఇలా ఓ కొత్త ట్రెండ్ తో ఆహ్వాన పత్రికతో ఓటర్లలో చైతన్యం నింపే ప్రయత్నం చేపడుతోంది ప్రభుత్వం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సాఫ్ట్ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: