- మారుతున్న పరిణామాలతో పెరుగుతున్న మద్దతు
- రాజకీయాలకు అతీతంగా సొంత సామాజిక వర్గం నుంచి లభిస్తున్న భరోసా
- ప్రచారంలో దూసుకుపోతున్న నామ,  కుటుంబ సభ్యులు

( ఖమ్మం - ఇండియా హెరాల్డ్ )

అసెంబ్లీ ఎన్నికల తర్వాత చతికిల పడిందనుకున్న బిఆర్ఎస్ కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు కనిపిస్తోంది. ఆశించే స్థాయిలో పార్లమెంటు విజయాలు సాధించకపోయినప్పటికీ ఓటు బ్యాంకును మెరుగుపరుచుకుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో హోరా హోరి పోటీ ఇవ్వబోతున్నట్టు విశ్లేషకులు అంచనాలు చేస్తున్నారు. అలా హోరాహోరీ పోటీ జరిగే నియోజకవర్గాల్లో ఖమ్మం కూడా ఒకటి. పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు  పలు వర్గాల నుంచి ముఖ్యంగా సొంత సామాజిక వర్గమైనటువంటి కమ్మ సామాజిక వర్గం నుంచి వస్తున్న మద్దతు చూస్తున్న విశ్లేషకులు, పార్టీ నేతలు ఆయన విజయం సాధిస్తారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లాలో ప్రస్తుత పరిణామాలు నేపథ్యంలో నామ నాగేశ్వరరావుకు గెలుపు సులువు కాదన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ.. స్థానికంగా ఉన్న సామాజిక సమీకరణాలు కొంతమేరకు నామ నాగేశ్వరరావు కలిసొచ్చే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది.


ఖమ్మం ఎంపీ టికెట్ పై బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నే స్పష్టత ఇచ్చారు. నామా నాగేశ్వరరావే తమ ఖమ్మం ఎంపీ అభ్యర్థి అని ప్రకటించారు. కానీ ఆ  అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు నిరాశ నిష్పృహల్లో మునిగిపోయారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి నాయకులు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరడంతో సగం కేడర్ వారితో పాటు వెళ్లిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తదనంతర పరిణామాలు తర్వాత మరికొందరు నేతలు హస్తం గూటికి చేరారు.


** దిశ మారుస్తున్న సామాజిక సమీకరణాలు
బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఖమ్మం సీట్ విషయమై ముందే స్పష్టత ఇచ్చినప్పటికీ అసెంబ్లీ ఫలితాల తర్వాత అంతగా ప్రభావం చూపలేకపోయారు. కేడర్ నైరాశ్యంలో ఉండడంతో నేతలు కూడా జనంలోకి వెళ్లలేకపోయారు. పార్లమెంట్ ఎన్నికలకు కొద్ది రోజులు ముందు బయటకు వచ్చిన గులాబీ నేతలు ప్రజల నుంచి అంతగా స్పందన కనిపించకపోవడంతో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ సీటుకు జిల్లాలో ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని కాదని..  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడైన రామ సహాయం రఘురాం రెడ్డికి అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు అండగా నిలిచిన టిడిపి, కమ్మ సామాజిక వర్గం లో అసంతృప్తి వ్యక్తం అయ్యింది. తమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి తాము మద్దతు ప్రకటించాలన్న చర్చ మొదలైంది.


ప్రస్తుతం ఇదే అంశం నామా నాగేశ్వరరావుకు కొంత కలిసోచ్చేలా కనిపిస్తోంది. కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక్కరికి కూడా అవకాశం లేకపోతే రాజకీయంగా తమ ప్రాబల్యం కోల్పోతామన్న భావనలో ఉన్న కమ్మ సామాజిక వర్గ ప్రజలు నామా నాగేశ్వరరావుకు బహిరంగంగానే మద్దతు పలుకుతున్నారు. రాష్ట్రం నుంచి ఎంపీ గా ఒక్కరైనా ఉండాలన్న పట్టుతో ఉన్నారు. అయితే ఇందులో కొందరు కాంగ్రెస్కి మద్దతు ప్రకటించినప్పటికీ అధిక శాతం మంది మాత్రం దాన్ని వ్యతిరేకించారు. ఇదే విషయమై ఖమ్మం కమ్మ మహాజన సంఘంలో రచ్చ కూడా జరుగుతోంది. ఏది ఏమైనా నామ నాగేశ్వరరావుకు సొంత సామాజిక వర్గం నుంచి వస్తున్న మద్దతు ఖమ్మం రాజకీయల దిశను మార్చబోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


* * టీడీపీ ఓటు బ్యాంకు పైనా ఆశలు :
తెలంగాణలో టిడిపికి అత్యంత బలమైన క్యాడర్ ఉన్న జిల్లా ఖమ్మం జిల్లా. ఈ జిల్లాపై ఏపీ రాజకీయాల ప్రభావం అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం ప్రజలు టిడిపిలో ఉండటం, ఇతర పార్టీలో ఉన్నప్పటికీ టిడిపి లో ఉన్న తమ మూలాలు మరిచిపోకుండా, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై అభిమానాన్ని మాత్రం చాటుతూనే ఉంటారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టు సమయంలో జరిగిన పరిణామాలను సీరియస్ గా తీసుకున్న టిడిపి కేడర్, కమ్మ సామాజిక ప్రజలు నాటి పరిణామాల ప్రకారం కాంగ్రెస్కు జై కొట్టారు. కానీ ఖమ్మం ఎంపీ సీటు కేటాయింపు విషయంలో కాంగ్రెస్ అవలంబించిన తీరుపై కినుక వహించిన టిడిపి కేడర్, కమ్మ సామాజిక వర్గ ప్రజలు ఈసారి తమ మద్దతు ఎవరికనే దానిపై తొలుత తర్జనభర్జనలు పడ్డారు.


చివరకు ఏపీలో బిజెపి, జనసేన పొత్తు ఉండడం నేపథ్యంలో తెలంగాణలోనూ తమ మద్దతు బిజెపికి ఉంటుందని ప్రకటించారు. దాంతో ఖమ్మం బిజెపిలో ఆశలు చిగురించాయి. అయితే పూర్తిస్థాయిలో దీన్ని టిడిపి కేడర్,  కమ్మ సామాజిక వర్గ ప్రజలు మాత్రం ఆమోదించే పరిస్థితి కనిపించడం లేదు. ఎవరో బయట వ్యక్తికి మద్దతు పలికే బదులు. . మొదటి నుంచి టిడిపితో, అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ కుటుంబాలతో సత్సంబంధాలు ఉన్న, ఖమ్మం జిల్లాలో తొలి నుంచి కమ్మ సామాజిక వర్గ అభ్యున్నతికి కృషిచేసిన నామనాగేశ్వరరావుకే మద్దతు ప్రకటిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణాల నేపథ్యంలో కొందరు బహిరంగంగానే నామకు జై కొడుతున్నారు.


ప్రచారంలో పై చేయి..
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయనతోపాటు ఆయన తనయులు, ఇతర కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ గెలుపు కోసం శ్రమిస్తున్నారు. కాంగ్రెస్లో సమన్వయం లోపించిందని, బిజెపికి సంస్థాగతంగా పట్టులేని క్రమంలో పరిస్థితులు తమకు అనుకూలంగా మారుతాయని బీఆర్ఎస్ భావిస్తోంది. కొంచెం కష్టపడితే ఖమ్మంలో విజయం తధ్యమని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. రెండు మూడు రోజులుగా నామ ప్రచారం ఉపు అందుకోవడం ఆ పార్టీ శ్రేణులో ఉత్సాహం నింపుతోంది. ఏది ఏమైనా పలు సమీకరణల నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఖమ్మం ఓటరు ఎవరినీ కనికరిస్తారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: