తెలిసి మాట్లాడినా.. తెలియక మాట్లాడినా. ఒక్కోసారి మనం చేసే వ్యాఖ్యలు బూమ్ రాంగ్ అవుతుంటాయి. తాజాగా ప్రధాని మోదీ చేసిన విమర్శలే ఇందుకు నిదర్శనం. ఏపీలో ఎలాగైనా ఎన్డీయే కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పలు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ.. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. వైఎస్ జగన్ ను ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు.


ఇటీవల రాజంపేట సభలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మోదీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ క్రమంలో వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందని హెచ్చరించారు. రాయలసీమ అనేక మంది ముఖ్యమంత్రులను ఇచ్చినా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఏ రంగంలోను పురోగతి సాధించలేదని విమర్శించారు. సాగు నీటి ప్రాజెక్టులు లేవని.. ఏపీలో డెవలమ్ మెంట్ జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని అన్నారు.


అన్నమయ్య ప్రాజెక్టు కూలిపోవడం బాధ కలిగిందని.. పోలవరం విషయంలో ఏం జరుగుతుందో మనందరకీ తెలిసిందే అని వ్యాఖ్యానించారు. రాయలసీమలో ఖనిజ సంపదకు లోటు లేదన్నారు. రాయలసీమ అభివృద్దికి ఎన్నో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ వికాసమే మోదీ లక్ష్యం అని వివరించారు.


ఇంతవరకు బాగానే ఉన్నా.. గతంలో సీఎంలుగా పనిచేసిన వారిలో ఎన్డీయే భాగస్వామి టీడీపీ అధినేత చంద్రబాబు, ఎవరి తరఫున అయితే ప్రచారం చేస్తున్నారో ఆయన కూడా రాయలసీమ సీఎం కావడం గమనార్హం. అంటే ఇన్ డైరెక్ట్ గా వారిద్దరనీ విమర్శించినట్లే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఎన్డీయే అధికారంలోకి వచ్చినా రాయలసీమ వ్యక్తే సీఎం అవుతారు అనే విషయం ప్రధాని మరిచిపోయినట్లున్నారు. సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడానికి 14 ఏళ్లు పాలించిన చంద్రబాబే కారణం అని విమర్శిస్తున్నారు. వైఎస్ హయాంలో పోతిరెడ్డి పాడు ఎత్తిపోతల పథకాన్ని ప్రవేశ పెట్టగా,  రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సీఎం జగన్ ప్రవేశ పెడుతున్నారు. ఆ లెక్కన రాయలసీమకు ఏం చేయని సీఎంల జాబితాలో ముందు వరుసలో చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలే ఉంటారు. ఈ లెక్కన మోదీ చేసిన వ్యాఖ్యలు మాజీ సీఎంలను షాక్ కు గురిచేసేవే.

మరింత సమాచారం తెలుసుకోండి: