తెలుగు  సినిమా  ప్రరిశ్రమలో  ప్రసిద్ధిగాంచిన దర్శకులలో  మన ఇవివి సత్యనారాయణ ఒకరు. అంతే కాకుండా తెలుగు సినిమాకు కమర్షియల్‌ కామెడీ అందించిన అతి కొద్ది మంది దర్శకుల్లో ఆయన ఒకరు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు.

 

తొలిసారిగా దేవదాసు కనకాల దర్శకత్వంలో రూపొందుతున్న ఓ ఇంటి భాగోతం సినిమాకు సహాయ దర్శకుడిగా జాయిన్‌ అయ్యారు..అప్పటినుంచి ఇవివి వెనుదిరిగి చూడలేదు. ప్రముఖ దర్శకుడు జంధ్యాలకు శిష్యుడిగా మారిన తరువాత ఆయనకు తన గమ్యం ఏంటో, తను ఎటువంటి  సినిమాలను తీయగలడో తెలుసుకున్నాడు. తొలి సినిమా చెవిలో పువ్వు  సినిమాతో  నిరాశపడినా.. తరువాత రామానాయుడు నిర్మించిన ప్రేమఖైదీ చిత్రంతో ఈవివికి బ్రేక్‌ వచ్చింది. ఆ చిత్రం విజయవంతం కావటంతో ఇవివికి మంచి అవకాశాలు వచ్చాయి.

 

జంధ్యాల కంటే కొంచెం ఘాటైన హాస్యాన్ని చిత్రాల్లో ప్రవేశపెట్టారు.అగ్ర నటులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో భారీ బ్లాక్‌ బస్టర్‌లను అందించారు ఇవివి. రంభ, ఊహ, ఆమని, రవళి వంటి నటీమణులతో పాటు పవన్‌కళ్యాణ్‌ను కూడా తెలుగు తెరకు పరిచయం చేసారు.. జంద్యాల లాంటి మహామహులు అందిస్తున్న సున్నితమైన కామెడీకి దూరంగా ఆ కామెడీకి కాస్త స్పైస్‌ జోడించి తెలుగు తెరమీద నవ్వులు పువ్వులు పూయించిన దర్శకుడు ఇవివి సత్యనారాయణ... రాజేంద్ర ప్రసాద్ తో ఆ ఒక్కటి అడక్కు, అప్పుల అప్పారావు, ఆలీబాబా అరడజనుదొంగలు వంటి చిత్రాలు మరియు నరేష్ తో  "జంబలకిడి పంబ "మొదలైన చిత్రాలు తీశారు.

 

ఇంద్రుడు-చంద్రుడు సినిమాలో పోలీస్ అధికారి క్యారెక్టర్ వేసి తనలోని నటున్ని కూడా పరిచయం చేశారు..  రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా తన కంటు ఒక  ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు ఈవీవీ. సినిమాలకి  వెరైటీ టైటిల్స్ పెట్టాలంటే ఆయనకు మించిన  వారు ఎవరు లేరు.  గోదావరి యాస డైలాగులు పలికించినా, కామెడీ క్యారెక్టర్లన్నిటినీ వరసపెట్టి ఒకే సినిమాలో చూపించినా... అవన్నీ ఈవివికే చెల్లాయి. ఫిట్టింగ్ మాస్టర్.. బెండు అప్పారావు ఆర్‌ఎంపీ.. తొట్టిగ్యాంగ్.. దొంగల బండి.. ఎవడి గోల వాడిది.. వీడెక్కడి మొగుడండీ.. అదిరింది అల్లుడూ.. కితకితలు.. ఇలాంటి టైటిల్స్ విన్నప్పుడల్లా ఆయన మార్క్‌ కొట్టోచ్చినట్టుగా కనిపిస్తుంది, అదే ఇవివి స్టైలంటే.

 

ఈవీవీ సత్యనారాయణ కి ఇద్దరు కుమారులు. నరేష్, రాజేష్.. వీళ్ళద్దరు కూడలి సినీ పరిశ్రమకు సుపరిచితులే. తన వారసులు అయిన  ఆర్యన్‌ రాజేష్‌, అల్లరి నరేష్‌లను హీరోలుగా పరిచయం చేసి, వారిద్దరితో కూడా మంచి సక్సెస్‌ఫుల్‌ సినిమాలను అందించారు..ఇలా తెలుగు తెరకు ఎన్నో మరపురాని చిత్రాలు అందించిన ఇవివి సత్యనారాయణగారు జనవరి 21, 2011 న స్వర్గస్తులయ్యారు. అయన  భౌతికంగా మనతో లేకున్నా అయన  నవ్వు మాత్రం  బతికున్నంత కాలం మనతోనే ఉంటుంది. 

 

 

 

 

 

 

  

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: