భారతదేశంలోని సినీ ప్రేమికులంతా ఎదురు చూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వం ప్రతిభ.. ఇద్దరు స్టార్ హీరోల విన్యాసాల కోసం కోట్లాది మంది సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఇద్దరు హీరోల టీజర్లు ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. అయితే.. సినిమాలో కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ టీజర్ ను రీసెంట్ గా రివీల్ చేశారు. ఈ టీజర్ పై ప్రస్తుతం వివాదం నడుస్తోంది. ఇప్పుడు దీనికి రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది.

కొమరం భీమ్ పాత్రను పరిచయం చేసే క్రమంలో ఎన్టీఆర్ ను ఒక మత విశ్వాసానికి ప్రతీకగా చూపారంటూ ఇటివల ఆందోళనలు రేగాయి. ఆదివాసీలు రాజమౌళిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సన్నివేశాలు ఉంటే సినిమా విడుదల కానీయమని.. ధియేటర్ల వద్ద ఆందోళన చేస్తామని.. రాజమౌళి ఇంటిని ముట్టడిస్తామంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజమౌళిపై అదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదు. కొమరం భీమ్ నిజాం పాలకులతో పోరాటం చేశారు. ఆయన పాత్రను మత సంబంధంగా చూపడం సరికాదు. రాజమౌళి ఆ సన్నివేశాలను తొలగించాలి. లేదంటే ధియేటర్లపై దాడి చేస్తాం’ అంటూ హెచ్చరించారు.


దీంతో ఈ సినిమాపై ఆదివాసీల ఆందోళనే కాకుండా రాజకీయంగా కూడా వివాదం చెలరేగేలా ఉంది. ఈ వివాదాలన్నింటిపై ఇంతవరకూ రాజమౌళి స్పందించ లేదు. అయితే.. కేవలం సినిమా టీజర్ చూసి ఓ అంచనాకు రావడం సరికాదనేది కొందరి వాదన. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. రామ్ చరణ్ పై టీజర్ ను గతంలోనే విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: