నిజామాబాద్‌ జిల్లాలో అధికారం ముసుగులో కొందరు రాజకీయ నాయకులు భూదందాకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు కబ్జా గిరి చెలాయిస్తున్నారు. నిజామాబాద్ నగర శివార్లలోని నాగారం ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములున్నాయి. ప్రధానంగా బీడీ కార్మికులు, గంజ్ కార్మికులు, హమాలీలు, దర్జీలు, కోర్టులో పని చేసే నాలుగో తరగతి ఉద్యోగులు తదితరులకు ఈ ప్రాంతంలో పట్టాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ స్వగృహ లాంటి పథకాల ద్వారా పేదల కాలనీలు ఏర్పడ్డాయి. అయితే ఇక్కడ సగం మంది కూడా ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లను, ఇళ్లను ఉపయోగించుకోవడం లేదు. దీంతో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములపై రాజకీయ గద్దల కన్నుపడింది. ఆ స్థలం పేరిట నకిలీ పట్టాలు తయారు చేసి ఎవరో ఒకరికి అమ్మేస్తున్నారు. కొన్నవారు ఆ కబ్జా స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు వారు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు.

నిజామాబాద్ కార్పొరేషన్ లో కీలక నేతగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఇక్కడ కబ్జా కింగ్ అవతారమెత్తాడు. కార్పొరేషన్ పరిపాలనను శాసించే హోదాలో ఉన్న ఆ వ్యక్తి ముఖ్య నేతలతో ఉన్న సంబంధాలను భూదందాకు వాడుకుంటున్నాడు. మొదట్లో మొరం దందాకు నాయకత్వం వహించిన అతను కార్పొరేషన్ లో కీలక పదవి దక్కడంతో భూ కబ్జాలకు తెరలేపాడు. నాగారం ప్రాంతంలో గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ప్లాట్లు, ఇళ్లపై ఆయన వ్యాపారం సాగుతోంది. ఖాళీగా ఉన్న ప్లాట్ల పేరిట నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించుకుంటున్నారు. ఒక్కో ప్లాటును రెండు నుంచి మూడు లక్షల వరకు అమ్ముకుంటున్నారు. దీనికోసం ఆ కబ్జా కింగ్ నేతృత్వంలో ఓ ముఠా పని చేస్తోంది. వీరు ముందుగా నకిలీ పట్టాలు తయారు చేసి అమ్ముతున్నారు. ఆ తర్వాత ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ పాగా వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు లబ్దిదారుడు వస్తే మరో ఇద్దరు, ముగ్గురు నకిలీ పట్టాదారులను పిలిపించి గొడవ చేయిస్తున్నారు. ఆ స్థలం నాదంటే నాదంటూ వారు గొడవకు దిగేలా వీరి వ్యూహరచన ఉంటుంది. చివరికి అసలైన లబ్దిదారుడిని నయానో, భయానో ఒప్పించి పక్కకు తప్పిస్తున్నారు.

ఈ ముఠాకు రెవెన్యూ, పోలీసుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సదరు కబ్జా కింగ్ కార్పొరేషన్‌లో కీలక నేత కావడం, ఆయనకు ఓ బడానేత అండదండలు ఉండటంతో అధికార యంత్రాంగం కూడా సహకరిస్తోంది. ఆ నేత ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కీలక పదవి దక్కించుకునేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేశారని ప్రచారంలో ఉంది.. ఆ డబ్బు రాబట్టుకోవాలంటే మున్సిపల్ పనులు సరిపోవని, ఇలాంటి కొత్త వ్యాపారాలు చేయాల్సిందేనని ఆయన సన్నిహితులతో చెప్పడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: