టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి శ్రీ కేటీఆర్ బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాపై తీవ్రంగా మండిప‌డ్డారు. రెండు సార్లు ప్ర‌జ‌ల‌తో ఎన్నుకోబ‌డ్డ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అని, ఆయ‌న‌పైనే న‌డ్డా జుగుప్సాక‌ర‌మైన‌, హేయ‌మైన మాట‌లు మాట్లాడుతున్నార‌ని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఎం కేసీఆర్‌పై న‌డ్డా చేసిన వ్యాఖ్య‌ల‌ను తాము ఖండిస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ బుధ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో విలేక‌రుల స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… న‌డ్డా అంటే త‌మ‌కు నిన్న‌టి వ‌ర‌కూ ఓ గౌర‌వం ఉండేద‌ని, ఇప్పుడు బండి సంజ‌య్‌తో స‌మానంగా మారిపోయార‌ని ఎద్దేవా చేశారు. బీజేపీ నేత‌ల తీరు చూస్తుంటే ఆ పార్టీ పేరును ‘బ‌క్వాస్ జుమ్లా పార్టీ’గా పేరు మార్చేయ‌వ‌చ్చ‌ని అన్నారు.

తెలంగాణ‌లో ఏం కొంప‌లు మునిగిపోయాయ‌ని న‌డ్డా హైద్రాబాద్ వ‌చ్చార‌ని సూటిగా ప్ర‌శ్నించారు. బీజేపీవి ఎర్ర‌గ‌డ్డ మాట‌లు, ఎర్ర‌గ‌డ్డ చేత‌ల‌ని, ప్ర‌జ‌ల‌న్నీ చూస్తున్నార‌ని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నీతి ఆయోగ్‌కు ఉన్న నీతి కూడా న‌డ్డాకు లేద‌ని, కాళేశ్వ‌రానికి జాతీయ హోదా ఇవ్వ‌కుండా న‌డ్డా.. సిగ్గులేకుండా మాట్లాడుతున్నార‌ని కేటీఆర్ దుయ్య‌బ‌ట్టారు. క‌ల్లాల్లో ఉన్న వ‌డ్ల నుంచి మొద‌లు పెడితే, కంటోన్మెంట్ రోడ్ల దాకా అంతా బీజేపీ కిరికిరే చేస్తోంద‌ని మండిప‌డ్డారు. మిష‌న్ భ‌గీర‌థ గొప్ప ప‌థ‌క‌మ‌ని సాక్షాత్తూ కేంద్ర మంత్రి షెకావ‌తే ప్ర‌క‌టించార‌ని, న‌డ్డానేమో నీళ్లు రావ‌డం లేద‌ని పేర్కొంటున్నార‌ని వీరిద్ద‌రిలో ఎవ‌రికి మెంట‌ల‌ని కేటీఆర్ సూటిగా ప్ర‌శ్నించారు. కాళేశ్వ‌రంలో అవినీతి జ‌ర‌గ‌లేద‌ని సాక్షాత్తూ పార్ల‌మెంట్‌లోనే కేంద్రం ప్ర‌క‌టించింద‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. మ‌రి ఈ విష‌యంలో కేంద్రానిది క‌రెక్టా? న‌డ్డాది క‌రెక్టా? అని నిల‌దీశారు.

ఈ ఏడేండ్ల‌లో ప్ర‌ధాని మోదీ చేసిన మంచి ప‌ని ఒక్క‌టి కూడా లేద‌ని కేటీఆర్ మండిప‌డ్డారు. యూపీలో బీజేపీ అభివృద్ధి పేరిట ఓట్ల‌ను అడ‌గ‌డం లేద‌ని, విద్వేషాలు రెచ్చ‌గొట్టి ఓట్ల‌ను పొందాల‌ని చూస్తోంద‌న్నారు. క‌నీసం అర పైసా ఉప‌యోగ‌ప‌డే ప‌నిని మోదీ చేశారా? అంటూ ఫైర్ అయ్యారు. ఇంత దిక్కుమాలిన‌, దౌర్భాగ్య‌పు ప్ర‌భుత్వం ఎక్క‌డైనా ఉంటుందా? అని మండిప‌డ్డారు. యూపీ వేదిక‌గా బీజేపీ విష ప్ర‌చారానికి దిగుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. మోదీ ప్ర‌భుత్వం సిగ్గు మాలిన ప్ర‌భుత్వ‌మ‌ని, ప్ర‌జ‌ల కోసం ఎన్నో హామీలిచ్చార‌ని, వాటి అమ‌లు ఏమైంద‌ని నిల‌దీశారు.

2022 క‌ల్లా ప్ర‌తి ఒక్క‌రికీ ఇల్లు క‌ట్టిస్తామ‌ని మోదీ హామీ ఇచ్చార‌ని, దీంతో పాటు రైతుల ఆదాయాన్ని కూడా రెట్టింపు చేస్తామ‌ని హామీ ఇచ్చార‌ని, ఈ రెండు ఏమయ్యాయ‌ని కేటీఆర్ ప్ర‌శ్నించారు. వీటితో పాటు ప్ర‌తి ఇంటికి టాయ్‌లెట్ క‌ట్టిస్తామ‌ని కూడా ప్ర‌క‌టించార‌ని, క‌నీసం గుజ‌రాత్‌లోనైనా పూర్తైందా? అని కేటీఆర్ నిల‌దీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: