తెలంగాణలో ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం రోజుకు రెండు వేల వరకూ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే.. రాష్ట్ర జనాభాలో 30 శాతం మంది వరకూ ఒమిక్రాన్ బారిన పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడే వేరియంట్‌ వ్యాప్తి ప్రారంభమైంది. అసలే బాగా వ్యాపించే గుణం ఉండటంతో కేసులు త్వరలో భారీగా పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓ అంచనా ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30 శాతం  జనాభాకు వైరస్‌ సోకే అవకాశాలున్నాయట.


ఇప్పుడు కేసులు తక్కువగానే కనిపిస్తున్నా సంక్రాంతి తర్వాత కేసులు పెద్దసంఖ్యలో వస్తాయని అంచనా వేస్తున్నారు. అలా జరిగితే దానికి తగ్గట్టు వైద్య సదుపాయాలు అందించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందుకు తగినట్టుగా ఆస్పత్రులను సంసిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగానే తాజాగా వైద్య సిబ్బందికి సెలవులను రద్దు చేశారు. ఆదివారం కూడా టీకా పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. కరోనా పరీక్షలు తగ్గకుండా చూడాలని.. వీలైనంత వరకూ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నా.. డెల్టాతో పోల్చితే ఒమైక్రాన్‌ వేరియంట్‌ గొంతులోనే ఉంటోంది. ముక్కు, గొంతు నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం లేదు. ఇదో ప్లస్ పాయింట్. అందువల్లనే  కేసుల్లో 90 శాతం వరకూ ఆస్పత్రుల్లో చేరే అవసరం రావడం లేదు. అయితే.. ఫిబ్రవరి  15 నాటికి తెలంగాణ రాష్ట్రంలో థర్డ్‌వేవ్‌ పతాక స్థాయికి చేరుతుందని వైద్య శాఖ భావిస్తోంది.  ఆ తర్వాత క్రమంగా కేసులు తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తోంది.


ఒమిక్రాన్  కేసులు క్రమంగా పెరుగుతున్న దృష్ట్యా ఆదివారం కూడా కరోనా వ్యాక్సినేషన్‌ను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా పరీక్షలు తగ్గకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అంతే కాదు... కొవిడ్‌ తగ్గేవరకు బస్తీ దవాఖానాలు, పీహెచ్‌ సీలు, సబ్‌-సెంటర్లు కూడా ఆదివారం పనిచేయనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: