రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ 160 సీట్లలో గెలుపు ఖాయమని చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు పదే పదే చెబుతున్నారు. అయితే చరిత్రను ఒకసారి చూస్తే వీళ్ళ ప్రకటనల్లోని డొల్లతనం ఇట్టే బయటపడిపోతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో రిజర్వుడు నియోజకవర్గాల్లో గెలుపుకోసం టీడీపీ నానా అవస్తలు పడుతోంది. ఒకప్పటి సంగతేమో కానీ 2004 నుండి టీడీపీ గెలవని నియోజకవర్గాలున్నాయి.





మరీ ముఖ్యంగా వైసీపీ ఆవిర్భావం తర్వాత అంటే 2014 ఎన్నికలనుండి తీసుకుంటే టీడీపీ గెలవని నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో టీడీపీ తరపున పోటీచేసిన వాళ్ళు అత్యధికులు ఓడిపోతున్నారు. 2019 ఎన్నికల్లో 29 ఎస్సీ నియోజకవర్గాల్లో టీడీపీ పోటీచేస్తే గెలిచింది కేవలం ఒకే ఒక్క నియోజకవర్గం. ప్రకాశం జిల్లాలోని కొండపి ఎస్సీ నియోజకవర్గంలో పోటీచేసిన డోలా బాల వీరాంజనేయస్వామి మాత్రమే గెలిచారు.





మిగిలిన 28 నియోజకవర్గాలూ వైసీపీ ఖాతాలోనే పడిపోయాయి. అలాగే 9 ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలైతే మరీ అన్యాయంగా తయారయ్యాయి. రెండు వరుస ఎన్నికల్లో టీడీపీ తరపున ఒక్కరంటే ఒక్క అభ్యర్ధి కూడా గెలవలేదు. వీళ్ళు కాకుండా ముస్లిం మైనారిటీల తరపున ఒక్క ఎంఎల్ఏ కూడా గెలవలేదు. 2014, 19 ఎన్నికల్లో టీడీపీ తరపున ఒక్క ముస్లిం అభ్యర్ధి కూడా గెవలేదు.





ఇది చూసిన తర్వాత హోలు మొత్తంమీద 175 నియోజకవర్గాల్లో సుమారు 40 నియోజకవర్గాల్లో టీడీపీ అసలు బోణియే కొట్టలేకపోతోంది. మరలాంటపుడు 160 సీట్లలో ఎలా గెలుస్తుంది. మొన్నటివరకు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటిలు టీడీపీ తరపున గెలవలేదు కాబట్టి రేపటి ఎన్నికల్లో గెలవకూడదని ఏమీలేదు. కాకపోతే పై వర్గాలన్నీ వైసీపీనే అంటిపెట్టుకుని ఉన్నాయికాబట్టి టీడీపీ గెలిచే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. అందుకనే ఈ నియోజకవర్గాల్లో ఎన్ని వీలైతే అన్నింటిలో వచ్చే ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారట. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.






మరింత సమాచారం తెలుసుకోండి: